కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandi), వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) దంపతుల కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన కుమారుడు తన జీవిత భాగస్వామిని ఎంచుకున్నాడన్న సంతోషకరమైన విషయాన్ని రాబర్ట్ వాద్రా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్ ఖాతాలో రైహాన్ (Raihan Vadra), అతని కాబోయే భార్య అవీవా (Aviva) కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆయన ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని రాశారు. ‘నా కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడని, తన జీవిత భాగస్వామిని కనుగొన్నాడని’ పేర్కొంటూ ఆ జంటకు తన ఆశీస్సులు అందజేశారు. వారిద్దరి జీవితం ఎల్లప్పుడూ సంతోషం, ప్రేమ, ఐకమత్యంతో వర్ధిల్లాలని, ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఈ జీవిత ప్రయాణంలో కలిసి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
రాబర్ట్ వాద్రా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నెహ్రూ కుటుంబ వారసుడి పెళ్లి వార్త తెలియడంతో పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read Also: సోమనాథ్ ఆలయానికి ముఖేష్ అంబానీ భారీ విరాళం
Follow Us On: Sharechat


