హెరిటేజ్ శాఖ పరిశీలనలో ములుగు డాల్మెన్ సమాధులు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) ప్రభుత్వం హెరిటేజ్ శాఖ టెక్నికల్ బృందం మొట్లగూడెం గ్రామాన్ని పరిశీలించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ గారి ఆదేశాల ప్రకారం ఆచార్య అర్జున్ రావు (డైరెక్టర్), డా. పి. నాగరాజు (డిప్యూటీ డైరెక్టర్), ఎ. రాజు (OSD) నేతృత్వంలో బృందం ఈ ప్రాంతంలో ఉన్న ప్రాచీన మానవ సమాధులను పరిశీలించింది. చంద్రునిపై మనిషి అడుగుపెట్టిన ఆధునిక యుగంలో, 5G వేగంతో సమాచార మార్పిడి జరుగుతున్న సందర్భంలో, పాతరాతి యుగానికి చెందిన విశేషాలు వెలుగులోకి రావడం ఆశ్చర్యకరంగా భావించవచ్చు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో గుర్తించిన ఈ మానవ సమాధులు, ఆ కాలంలో మానవుల జీవన విధానం, ఆచారాలు, వృత్తులు, సామాజిక నిర్మాణం వంటి అంశాలపై విలువైన చారిత్రక ఆధారాలను అందిస్తున్నాయి. ములుగు(Mulugu) జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మొట్లగూడెం (Motlagudem) గ్రామ పరిసర ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ సమాధులను  స్థానికులు “రాక్షస బండలు” లేదా “రాక్షస గుహలు” అని పిలుస్తారు.

కాలక్రమేణా కొన్ని సమాధులు శిథిలావస్థకు చేరగా, మరికొన్ని రాళ్లను స్థానికులు గృహనిర్మాణ అవసరాలకు వినియోగించారు. సమాధులలోని రాతి తొట్లను పశువులకు నీటి కోసం ఉపయోగించడం గమనార్హం. కప్పలయ గుట్ట ప్రాంతంలోని సమాధులు సుమారు 4 నుండి 25 మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. పెద్ద రాళ్లను నిలబెట్టి, వాటి పై భారీ రాతి పలకను కప్పుగా అమర్చిన ఈ డాల్మెన్(Dolmen) నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి సమాధిలో చిన్న రాతి తొట్టి (సార్కోఫాగస్) ఉంటుంది. సమాధి చుట్టూ సుమారు 10 అడుగుల వ్యాసార్థంలో రాళ్లతో గోడ నిర్మించబడింది. సమాధుల మధ్య దూరం 5 నుండి 100 అడుగులు ఉండటం, ప్రణాళికపూర్వక నిర్మాణాన్ని సూచిస్తుంది.

కప్పలయ గుట్టలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ డాల్మెన్ సమాధుల సముదాయం(Dolmen burial sites), భారతదేశంలో ఇదే అత్యంత పెద్ద స్థాయి కావచ్చని టెక్నికల్ బృందం భావిస్తోంది. ఈ నిర్మాణాలు మరణానంతరం పునర్జన్మపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.  దక్షిణ భారతదేశంలో, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలో ఇలాంటి సమాధులు విస్తృతంగా ఉన్నాయని, తెలంగాణలోనూ అపూర్వ వారసత్వ నిర్మాణాలు ఉండటం మనందరికీ గర్వకారణం అని హెరిటేజ్ శాఖ అధికారులు తెలిపారు.

Read Also: మెదడు క్లీన్ కావాలంటే ఈ పని చేయండి.. స్టడీలో షాకింగ్ నిజాలు

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>