కలం, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం (Telangana SEC) కత్తెర గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ (Municipal Elections) కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తూ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
తెలంగాణ మున్సిపాలిటీల చట్టప్రకారం ఈ గుర్తులను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు అయిన గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, ఇతర రాష్ట్రాల రాష్ట్ర పార్టీలు, రిజర్వ్ గుర్తులు కలిగిన రాజకీయ పార్టీలు, రిజర్వ్ గుర్తులు లేని పార్టీలు, అలాగే ఫ్రీ సింబల్స్ జాబితాను వెల్లడించింది. అందులో భాగంగా తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి (Telangana Rajyadhikara Party) సైతం గుర్తింపు దక్కింది.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యాధికార పార్టీ ఈ కత్తెర గుర్తుతో పోటీ చేయనుంది. తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం రావడమే లక్ష్యంగా పార్టీని స్థాపించి ఆ దిశగా పోరాటం చేస్తున్నారు. మరి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ పోటీ చేస్తుందా? బీసీ జనం ఆయన పార్టీని ఆదరిస్తారా?.. కత్తెర గుర్తు అగ్రకుల ఆధిపత్యానికి కత్తెర వేస్తుందా?.. ఆయన బీసీ నినాదాన్ని ఓటర్లు గెలిపిస్తారా?.. బీసీల శక్తిని మల్లన్న పార్టీ ఏకం చేస్తుందా?.. వీటన్నింటికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సమాధానం ఇవ్వనున్నాయి.
Read Also: జర్నలిస్టులపై కేసులు.. మైలేజ్ బాటలో రాజకీయ పార్టీలు
Follow Us On: Sharechat


