epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జర్నలిస్టులపై కేసులు.. మైలేజ్ బాటలో రాజకీయ పార్టీలు

కలం, తెలంగాణ బ్యూరో : ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి (Journalists Arrest) తీసుకోవడం చర్చనీయాంశమైంది. పండుగ రోజు జర్నలిస్టుల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తారా అంటూ ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఇచ్చిన కంప్లైంట్ మేరకు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు సమర్థించుకుంటున్నారు. రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకోవడంతో పోలీసుల ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న టీవీ ఛానెళ్ళ, సోషల్ మీడియా ప్రతినిధులు అలర్ట్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో తీన్మార్ మల్లన్న (ఇప్పుడు ఎమ్మెల్సీ), ‘మన తొలి వెలుగు’ జర్నలిస్టు రఘును పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లను పోలీసులు గతేడాది మార్చిలో అరెస్టు చేశారు. తాజాగా ఎన్టీవీకి చెందిన ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారు.

మహిళా ఐఏఎస్‌పై కథనమే కారణం :

రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక మహిళా ఐఏఎస్ అధికారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా టీవీ ఛానెల్‌లో ప్రసారమైన కథనం ఎఫెక్టుతో ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కార్యాలయానికి వెళ్ళి ఫుటేజ్ సహా ఇతర వివరాల కోసం ప్రయత్నించారు. సర్వర్‌ను స్వాధీనం చేసుకోవడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మంత్రిని, మహిళా ఐఏఎస్ అధికారిని ఉద్దేశిస్తూ ఆధారాలేవీ లేకుండా ఒక కథనాన్ని ప్రసారం చేయడంపై ఐఏఎస్ అసోసియేషన్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ఎన్టీవీ యాజమాన్యం, రిపోర్టర్లతో పాటు మరో ఎనిమిది మీడియా సంస్థలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. మూడు చట్టాల కింద కేసులు నమోదు చేశారు. దాని ఆధారంగా డీజీపీ నిర్ణయంతో సిటీ పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. దర్యాప్తు ప్రారంభంలోనే ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం సంచలనం రేకెత్తించింది.

ఈ ఎపిసోడ్‌తో పొలిటికల్ కలర్ :

ముగ్గురు రిపోర్టర్లను సిట్ అధికారులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ సహా జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగినట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ రిపీట్ అవుతున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. “నాడు అరెస్టులు చేయించిన బీఆర్ఎస్ పెద్దలే ఇప్పుడు ఎన్టీవీ జర్నలిస్టుల విషయంలో పరామర్శలకు బయలుదేరారు… ఖండనల పేరిట ప్రకటనలు విడుదల చేస్తున్నారు.. రాజకీయ అవసరాలకు ఈ ఎపిసోడ్‌ను వాడుకుంటున్నారు..” అనే కామెంట్లూ వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలు “వారిపై అక్రమంగా కేసులు పెట్టారు… పండుగ రోజున అర్ధరాత్రి పట్టుకుంటారా?.. ఆ కుటుంబాల్లో సంతోషం లేకుండా చేస్తారా?… నోటీసులే ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడమేంటి?..” అని కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యమ జర్నలిస్టులను కీర్తిస్తూనే… :

తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులది కీలక పాత్ర అంటూ కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల పాత్రను మరిచిపోలేదని కూడా సీఎం అయిన కొత్తలో గుర్తుచేశారు. అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. సరిగ్గా ఈ మాటలకు భిన్నంగా రెండో టర్ములో జర్నలిస్టు తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో జర్నలిస్టు రఘు (Journalist Raghu)ను అరెస్టు చేశారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టుల పాత్రను ప్రస్తావించి కీర్తించిన కేసీఆర్ ఈ ఇద్దరిని అరెస్టు చేయించారనే విమర్శలు వచ్చాయి. తీన్మార్ మల్లన్న మూడు నెలలకు పైగా జైల్లో ఉన్నారు. రోడ్డు మీద పండ్లు కొంటున్న జర్నలిస్టు రఘును మఫ్టీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టైమ్‌లో దాదాపు నలభై మంది జర్నలిస్టులను పన్నెండు గంటల పాటు నిర్బంధించారు.

ప్రజాస్వామ్యం ఏడో గ్యారంటీ అంటూనే.. :

ప్రజా పాలన సాగిస్తామని, నిర్బంధాలు ఉండవని, ప్రజాస్వామ్యం ఏడో గ్యారంటీగా ఉంటుందని సీఎం అయిన సందర్భంగా రేవంత్‌ రెడ్డి నొక్కిచెప్పారు. తాజాగా ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి (Journalists Arrest) ఘటనను ప్రస్తావిస్తూ ఇదేనా ఏడో గ్యారంటీ?.. ఇదేనా మీడియాకు ఇచ్చిన స్వేచ్ఛ?.. ఇదేనా ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న పాలన?.. అంటూ పలువురు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. గతంలో మహిళా జర్నలిస్టులు రేవతి (Journalist Revathi), తన్వి యాదవ్‌ను అరెస్టు చేసిన ఘటనలను ప్రకటనల్లో జోడిస్తున్నారు. కార్తీక మాసంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీవీ నిర్వహించిన ‘కోటి దీపోత్సవా’నికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇకపైన దీన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటించారు. మూడు నెలలైనా కాకముందే ఆ ఛానెల్ రిపోర్టర్లను అరెస్టు చేయించడం చర్చకు దారితీసింది.

Read Also: ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచనలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>