కలం, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మందికి ఖాళీ కడుపుతో వేడి వేడి టీ, కాఫీలు తాగడం అలవాటుగా మారిపోయింది. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఖాళీ కడుపుతో కెఫిన్ (టీ/కాఫీ) తీసుకోవడం వలన కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కెఫిన్ కు బదులుగా ప్రతిరోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం (Warm Water Benefits) వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిత్యం పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో జరిగే ఆరోగ్యకరమైన మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి ఈ అలవాటు ఎంతో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరికి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
2. శరీర అంతర్గత శుద్ధి: ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వలన శరీర అంతర్గత ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దీనివల్ల తేలికపాటి చెమట పడుతుంది. ఈ చెమట, మూత్రం ద్వారా శరీరంలో పేరుకుపోయిన హానికరమైన విష పదార్థాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
3. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది: గోరువెచ్చని నీళ్లు రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. దీనివల్ల శరీరం మొత్తానికి రక్తప్రసరణ సజావుగా సాగేలా దోహదపడుతుంది.
4. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వలన శరీరంలో జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. గోరువెచ్చని నీరు కడుపు, పేగుల కండరాలను ఉత్తేజపరిచి ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల రాత్రి ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
5. మలబద్ధకం: ఈ సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా గోరువెచ్చని నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వలన ప్రేగుల కదలికలు మొదలై మల బద్ధకం సమస్య దూరం అవుతుంది.
6. చర్మ సౌందర్యం: సాధారణంగా శరీరంలో వ్యర్థాలు పెరిగినప్పుడు మనకు మొటిమలు, ముడతలు వస్తాయి. గోరువెచ్చని నీరు తాగడం వలన శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. దీనివల్ల మొటిమలు తగ్గి సహజమైన గ్లో వస్తుంది.

