కలం, వెడ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట జనసేనకు న్యాయం జరగడం లేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetti Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో విజయవాడలోని నోవోటల్ హోటల్‌లో జరిగిన జనసేన పార్టీ మీటింగ్ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. CMRF చెక్కులు, ఇతర అంశాల్లో జనసేన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని.. ఇదే విషయాన్ని అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నామని గుర్తు చేశారు. తమకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ సహకరిస్తున్నా.. కిందిస్థాయిలో ఇంకా జరగడం లేదన్నారు. త్వరలో సమన్వయ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో జనసేనాని పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. వైసీపీ పాలనను అంతమొందించడానికి సీట్లను సైతం త్యాగం చేశారు. దీంతో జనసేన గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేసింది. రెండు పార్లమెంటు స్థానాల్లోనే బరిలోకి దిగింది. పోటీ చేసిన అన్నిస్థానాల్లో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ ను సాధించింది. దీంతో పవన్ కల్యాణ్ కు కీలకమైన డిప్యూటీ సీఎం,ఇతర శాఖలను కూటమి ప్రభుత్వం కేటాయించింది. అంతేకాదు పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు, లోకేష్ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. కింది స్థాయిలో టీడీపీ కేడర్ జనసేనతో కలిసి ముందుకు వెళ్లడం లేదా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తాజా పరిణామంతో కూటమిలో లుకలుకలు అంశం తెరపైకి వచ్చింది. మరి వీటిని సరిదిద్దుకుని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందా? కింది స్థాయి లీడర్లలో నెలకొన్న ఈ పంచాయతీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

