అధిక ఉష్ణోగ్ర‌త‌లు.. జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌పై నిజామాబాద్ క‌లెక్ట‌ర్ ఆదేశాలు

కలం, నిజామాబాద్ బ్యూరో : వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ (Nizamabad) కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయా శాఖల వారీగా అధికారులకు బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ (Nizamabad District Task Force Committee) ని సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈసారి వేసవి సీజన్ లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వేసవిలో కార్మికులు, ప్రజలు భారీ ఉష్ణోగ్రతల వల్ల వడగాడ్పులకు లోనై ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీరు అందుబాటులో ఉంచాలని, అన్ని బస్తీ దవాఖానాలు, పీ.హెచ్.సీ, సీ.హెచ్.సీలలో రెట్టింపు స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య, ఉపాధి హామీ, పర్యావరణ, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు వడదెబ్బ నివారణపై కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, కేంద్రాలకు వచ్చే వారికి ఓఆర్ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. గురుకులాలు, వసతి గృహాలలో ఎండ తీవ్రతపై అవగాహన కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని క‌లెక్ట‌ర్‌ సూచించారు.

ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా చూడాలని, ఒకవేళ అత్యవసరం అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. వడదెబ్బ నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందింపజేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీల ప్రదేశాల్లో నీడను అందించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, కూలీలు తప్పనిసరిగా తమ వెంట తాగునీటిని తెచ్చుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా వడదెబ్బతో ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యాల బారిన పడకుండా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని క‌లెక్ట‌ర్ ఇలా త్రిపాఠి అధికారుల‌కు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>