కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని త్వరలోనే వైభవంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) వెల్లడించారు.
ఆసుపత్రిలోని ఎ, బి, సి బ్లాకులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిగిలిన నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని తెలిపారు.
అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ సేవలు
టిమ్స్ లో అత్యాధునిక మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. క్రిటికల్ కేర్, అత్యవసర వైద్య సేవలు, అవయవ మార్పిడి వంటి సంక్లిష్టమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేలా ప్రభుత్వం దీనిని తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.

