రేపే విజయ్ బలనిరూపణ.. ఏం జరగబోతున్నది?

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో రేపు కీలక ఘట్టం చోటు చేసుకోనున్నది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం (Vijay Govt) అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనబోతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను పెంచుతున్నాయి. ఈ కీలక సమయంలో ఏఐఏడీఎంకే రెబల్ వర్గం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం రాజకీయవర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం నేతృత్వంలో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా నిలిచారు.

రేపటి బలనిరూపణకు ముందు మీడియాతో మాట్లాడిన షణ్ముగం, పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కూడా నాయకత్వ మార్పు జరగలేదని ఆయన అన్నారు. అలాగే పార్టీ అధినేత పళనిస్వామి డీఎంకేతో కలిసి రహస్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు చేశారని ఆరోపించారు.

ఏఐఏడీఎంకే సిద్ధాంతాలకు విరుద్ధంగా డీఎంకే ఒప్పందం చేసుకోవడాన్ని పార్టీ కార్యకర్తలు అంగీకరించలేదని షణ్ముగం స్పష్టం చేశారు. “అమ్మ” జయలలిత పాలన స్ఫూర్తిని తిరిగి తీసుకురావాలంటే కొత్త రాజకీయ దిశ అవసరమని, అందుకే టీవీకేకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.

అయితే ఈ ఆరోపణలను ఏఐఏడీఎంకే నాయకత్వం తీవ్రంగా ఖండించింది. రెబల్ నేతలు ప్రలోభాలకు లొంగి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వానికే మద్దతుగా ఉన్నారని స్పష్టం చేసింది. మరోవైపు టీవీకే ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం వంటి పార్టీల మద్దతుతో అసెంబ్లీలో బలమైన స్థితిని సాధించింది. దీంతో రేపటి విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి (Vijay Govt) అవసరమైన సంఖ్యాబలం ఎలా మారుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఇక అమ్మ మక్కల్ మున్నేట్ర కజగంలోనూ అంతర్గత సంక్షోభం కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఎస్. కరమాజ్ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంతో టీటీవీ దినకరన్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. మొత్తానికి రేపు జరిగే విశ్వాస పరీక్ష తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారింది. రెబల్స్ మద్దతు, కూటముల మార్పులు, పార్టీ అంతర్గత విభేదాలతో రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి.

Read Also: బండి భగీరథ్‌ పోక్సో కేసు.. సిట్ కీలక అడుగు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>