కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణం దివిటిపల్లి శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల (Double Bedroom Housing) మంజూరిలో అవినీతి జరిగినట్లు టీఎఫ్‌టీయూ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూం ఇండ్ల బాధితులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.గట్టన్న మాట్లాడుతూ.. దివిటిపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు వెళ్తే పైరవీకారులు అడ్డగించి దుర్భాషలాడుతున్నారని విమర్శించారు. కేటాయించిన ఇండ్లలో సుమారు 60 శాతం మంది అనర్హులు ఉన్నారని తెలిపారు. చాలామంది తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు తాళాలు వేసి, మరోచోట నివాసం ఉంటున్నారన్నారు. ఇంకొంతమంది ఇండ్లను అద్దెకిస్తున్నారని ఆరోపించారు. పైరవీరుకారులు, రాజకీయ నాయకుల అండతో చాలామంది అనర్హులు ఇండ్లను ఆక్రమించుకున్నారని తెలిపారు.
సమాచార హక్కు చట్టాన్ని అనుసరించి వందలాది అప్లికేషన్లు పెట్టుకున్నా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. ఇండ్ల అవకతవకలపై పారదర్శకంగా విచారణ చేస్తే రెవెన్యూ, ఇతర అధికారుల అవినీతి బయటపడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు జలాల్ పాషా, డబుల్ బెడ్రూం ఇండ్ల బాధితులు మాధవి, విజయలక్ష్మి, దివ్య, హనీఫా బేగం, మొహమ్మద్ బషీర్, అబ్దుల్ రెహమాన్, శ్రీదేవి, ఇతర మహిళలు ఉన్నారు.
Read Also: చక్కెరతో ముసలితనం.. యవ్వనాన్ని హరిస్తున్న తీపి రక్కసి!
Follow Us On: Instagram

