కలం, నేషనల్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) నేతృత్వంలోని డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చింది. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని సీఎం స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. దేశ అభివృద్ధిలో ముందున్న తమిళనాడు(Tamil Nadu) వంటి రాష్ట్రాలను శిక్షిస్తున్నట్టే ఈ విధానం ఉందని అన్నారు. ఇది కేవలం రాజకీయ అంశం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రేపు (ఏప్రిల్ 16) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల నేపథ్యంలో డీఎంకే అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భాగంగా పార్టీ భేదాలు లేకుండా అందరూ ఈ నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
దక్షిణాది రాష్ట్రాలకు ‘చారిత్రక అన్యాయం’
డీలిమిటేషన్ పేరుతో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం అనుసరిస్తున్న విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వత స్థాయిలో అన్యాయం జరుగుతుందని తమిళనాడు (Tamil Nadu) సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. దీని మూలంగా జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇది “చారిత్రక అన్యాయం” అని అభివర్ణించారు. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరిగి, దక్షిణాది రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందని వివరించారు.
దక్షిణాది ఐక్యతకు పిలుపు
డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంటులో వినిపించే అవకాశాలు తగ్గిపోతాయని వ్యాఖ్యానించిన తమిళనాడు సీఎం స్టాలిన్.. గతేడాది దక్షిణాది రాష్ట్రాల పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులను ఒక్క తాటిమీదకు తెచ్చేలా జేఏసీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేతలు ఈ సమావేశానికి గతేడాది మార్చి 22న హాజరయ్యారు. డీలిమిటేషన్‌తో జరిగే అన్యాయం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన అంశం కాదని, యావత్తు దక్షిణాదికే ముప్పుగా పరిణమించనుందని చర్చించి ఉమ్మడిగా తీర్మానాన్ని ఆమోదించి ప్రధాని మోడీకి పంపారు. అన్ని దక్షిణాది రాష్ట్రాలతో కలిపి ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుని కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల గొంతును కేంద్రం వినకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్టాలిన్ హెచ్చరించారు.

