కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు (Heatwave) విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క (Seethakka) కోరారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని సీతక్క కోరారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలపాగా, టోపీ, గొడుగు లాంటివి ధరించాలని సూచించారు. ఎండలను నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల కోసం గ్రామపంచాయతీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సీతక్క అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కూలీలు కూడా పనివేళల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పని ప్రదేశాల్లో నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క కోరారు.

