కలం డెస్క్ : చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న సరుకులు ఇకపైన డోర్ డెలివరీ కానున్నాయి. తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం దీపావళి కానుకగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ ను ప్రభుత్వం లాంఛనంగా రేపు (అక్టోబర్) ప్రారంభించనున్నది. వృద్ధులు, దివ్యాంగులు ఇకపైన రేషను దుకాణాల దగ్గరకు వచ్చి క్యూలో నిల్చుని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. పౌర సరఫరాల విభాగం సిబ్బందే ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్స్ (తూకం), ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్స్) మెషీన్ తో వచ్చి సరుకులు డెలివరీ చేస్తారు. ఇందుకు అవసరమైన మెకానిజం మొత్తం రెడీ అయింది. ఇందుకోసం ప్రభుత్వానికి నెలకు సుమారు రూ. 30 కోట్లు అదనంగా ఖర్చు కానున్నది.
తల్లీ-బిడ్డల పథకం :
ముఖ్యమంత్రి తాయ్ మానవర్(CM Thayumanavar Scheme) పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ప్రతి నెలా రెండో శనివారం, ఆదివారం డోర్ డెలివరీ సిస్టమ్ అమలవుతుందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను తాను అర్థం చేసుకుని శ్రీకారం చుట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో 20.42 లక్షల మంది వృద్ధులు, 1.27 లక్షల మంది దివ్యాంగులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇప్పటివరకు సంబంధిత రేషను దుకాణాల దగ్గర వృద్ధులు, దివ్యాంగులైన వినియోగదారులకు నేరుగా ఇంటి దగ్గరకే రేషను సరుకులు వస్తాయనే నోటీసు బోర్డులు ఏర్పాటయ్యాయి. ఈ నెల 22న దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో కొత్త స్కీమ్ అందుబాటులోకి రానుండడం గమనార్హం. రాష్ట్రంలోని(Tamil Nadu) మొత్తం 37, 328 రేషను దుకాణాల ద్వారా ఈ స్కీమ్ అమలుకానున్నది. గతంలో ఢిల్లీ రాష్ట్ర ప్ఱభుత్వం డోర్ డెలివరీ సిస్టమ్ ను ఉనికిలోకి తెచ్చింది తెలిసిందే.

