కలం డెస్క్ : వాట్సాప్.. ఇది ఒక స్మార్ట్ ఫోన్ యాప్ స్థానం నుంచి మనుషుల నిత్యావసరంగా మారిందనే చెప్పాలి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వినియోగిస్తుంటారనే చెప్పడం అతిశయోక్తేమీ కాదేమో. చిన్న చిన్న మెసేజ్‌ల నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్లను షేర్ చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ వాట్సాప్‌నే వినియోగిస్తుంటారు. అయితే వాట్సాప్ మన డేటాను స్టోరీ చేస్తోందని, మన ప్రతి అడుగును పరిశీలిస్తోందన్న ఆరోపణలు ఎన్నో వస్తున్నా.. మరో ప్రత్యామ్నాయం లేక అందరూ దీనినే వినియోగిస్తున్నారు.
మెసేజింగ్ యాప్‌లు చాలా వచ్చినా.. అవి వాట్సాప్‌కు ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. కానీ తాజాగా వాట్సాప్ ఢీకొట్టే యాప్ మార్కెట్లోకి వచ్చింది. అదే ‘అరట్టై’. ఇది పూర్తిగా భారతదేశ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయబడింది. ఈ యాప్ ఇప్పుడేమీ అందుబాటులోకి రాలేదు.. 2021 నుంచే ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు 2025లో అందరి ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంటోంది.
ఈ యాప్‌ను జోహో సంస్థ రూపొందించింది. ప్రస్తుతం ఈ యాప్.. గూగుల్ స్టోర్, యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. రోజురోజుకు ఈ యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇది వాట్సాప్‌కు ప్రత్యామ్నాయం కావడం కాదు.. వాట్సాప్‌ను రీప్లేస్ చేస్తుందని చాలా మంది భావిస్తున్నారు.
అరట్టై(Arattai), వాట్సాప్ మధ్య తేడా ఇదే..
-వాట్సాప్‌లో లేని కొన్ని కొత్త ఫీచర్స్.. అరట్టైలో ఉన్నాయ్. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.
-అరట్టై యాప్.. ఆండ్రాయిడ్ టీవీలతో పాటు అనేక ఇతర పరికరాలకు యాక్సెస్ అందిస్తుంది. వినియోగదారులు తమ ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో వినియోగించుకోవచ్చు. అయితే వాట్సాప్‌లో ఈ ఫీచర్ లేదు.
-వాట్సాప్‌లో లేని అరట్టైలో ఉన్న మరో కొత్త ఫీచర్ పాకెట్. ఇందులో యూజర్స్ తమ ఫొటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు సహా ఫైళ్లను సేవ్ చేసుకోవచ్చు.
అయితే వాట్సాప్‌లో ‘యు’ చాట్ విండో ద్వారా.. మనతో మనం చాట్ చేసుకుంటూ కావాల్సిన మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు వంటి వాటిని సేవ్ చేసుకోవచ్చు.
-అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లో కూడా బాగానే పనిచేస్తుంది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది.
-అరట్టైలో యూపీఐ వినియోగానికి కూడా జోహో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఐస్పిరిట్ గ్రూప్‌తో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

