కలం వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ (Secunderabad) పేరు మార్చేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆరోపించారు. ఈ నేథ్యంలో సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. శనివారం ఉదయం భారీ ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు జరుగనున్న ఈ ర్యాలీలో సికింద్రాబాద్‌లో ఇంటికొకరు చొప్పున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ రావాలని ఆహ్వానించారు.
సికింద్రాబాద్ 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం అని, సికింద్రాబాద్‌లో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయని తలసాని పేర్కొన్నారు. స్థానికంగా జరిగే లష్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉందన్నారు. ఇవన్నీ ఉన్న సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సికింద్రాబాద్‌ను టచ్ చేయలేదంటున్నారని, మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయిందో చెప్పాలని ప్రశ్నించారు. మహంకాళి, బోండా మార్కెట్, బేగంపేట్‌ను ఎందుకు మల్కాజిగిరి కమిషనరేట్‌లో కలిపారని, అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎందుకు మల్కాజిగిరిలో పని చేస్తుందో చెప్పాలని నిలదీశారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇదే మంచి సమయం అని, ప్రతి ఒక్కరూ ర్యాలీకి తరలిరావాలని తలసాని (Talasani Srinivas Yadav) పిలుపునిచ్చారు.
Read Also: మెట్రో రెండో దశపై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
Follow Us On: Instagram


