epaper
Monday, March 2, 2026
epaper

పరుగులు చేయలేకపోతే తప్పుకోవాల్సిందే.. అభిషేక్‌పై నాయర్ హాట్ కామెంట్స్

కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో టీమిండియా రాణిస్తున్నప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం వరుసగా నిరాశ పరుస్తూనే ఉన్నాడు. వరుస డకౌట్‌ల తర్వాత ఊపందుకున్నాడు అని చెప్పడమే తప్ప పరుగులు మాత్రం చేయలేదు. ఆఖరికి వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో కూడా అభిషేక్ 10 పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. దీంతో అభిషేక్ భవితవ్యంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా దీనిపై టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) కీలక వ్యాఖ్యలు చేశారు. పరుగులు చేయలేకపోతే తప్పుకోవడమే మంచి మార్గమని సూచించారు. టీ20 క్రికెట్‌లో బ్యాటర్లు పరుగులు చేయలేనప్పుడు క్రీజులో ఉండి బంతులు వృధా చేయడం కంటే, త్వరగా అవుట్ అయ్యి వేరే వారికి అవకాశం ఇవ్వడమే జట్టుకు మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 11 బంతుల్లో కేవలం 10 పరుగులే చేసి అవుట్ అయ్యారు. దీనిపై నాయర్ స్పందిస్తూ.. పవర్‌ప్లేలో వేగంగా ఆడలేనప్పుడు క్రీజులో పాతుకుపోయి జట్టుపై ఒత్తిడి పెంచడం కంటే త్వరగా నిష్క్రమించడమే సరైన నిర్ణయమని అభిషేక్ శర్మను సమర్థించారు. దీనికి ఉదాహరణగా విండీస్ కెప్టెన్ షై హోప్ ఇన్నింగ్స్‌ను ఆయన ఎత్తిచూపారు. హోప్ పవర్‌ప్లే అంతా ఆడి, 33 బంతుల్లో కేవలం 32 పరుగులే చేశారని, దీనివల్ల వెస్టిండీస్ భారీ స్కోరు సాధించే అవకాశాన్ని కోల్పోయిందని నాయర్ వివరించారు.

అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన వ్యక్తిగత స్కోరు కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని నాయర్ పేర్కొన్నారు. స్ట్రైక్ రేట్ పెంచే క్రమంలోనే అతను వికెట్ కోల్పోయారని, దీనివల్ల తర్వాత వచ్చిన బ్యాటర్లకు పవర్‌ప్లేలో వేగంగా ఆడే అవకాశం దక్కిందని విశ్లేషించారు. ఒకవేళ అతను క్రీజులో మరికొంత సమయం ఉండి నెమ్మదిగా ఆడి ఉంటే, టీమిండియా లక్ష్య ఛేదన కష్టమయ్యేదని అభిప్రాయపడ్డారు.

ఈ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ 97 పరుగులతో అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మార్చి 5, గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఆటగాళ్ల వ్యక్తిగత స్కోర్ల కంటే జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడటమే కీలకమని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!