కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) నూతన ముఖ్యమంత్రి ఎంపికపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సీనియర్ నేత సువేంధు అధికారి వైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వ విధానాలపై ఆయన సాగించిన పోరాటాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. శుక్రవారం జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పరిశీలకుడిగా హాజరుకానున్నారు. సీఎం రేసులో మరికొందరు నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సువేంధు పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
రేపటితో ముగియనున్న అసెంబ్లీ గడువు..
మరోవైపు బెంగాల్ (West Bengal) అసెంబ్లీ గడువు గురువారంతో ముగియనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను ఎన్నికల సంఘం అధికారులు నేడు గవర్నర్‌కు అందజేయనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా అంశంపై రాజ్యాంగ నిపుణులు కీలక వివరణ ఇచ్చారు. అసెంబ్లీ రద్దు కావడంతో ఆమె పదవి ఆటోమేటిక్‌గా పోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాసనసభ ఉన్నంత వరకే ప్రభుత్వం ఉంటుందని.. సభ గడువు తీరిన వెంటనే ప్రభుత్వం రద్దయినట్లుగానే పరిగణించాలని వారు చెబుతున్నారు. ఓటమి అనంతరం రాజీనామా లేఖ సమర్పించడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమేనని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also: విజయ్ TVKకు కాంగ్రెస్ మద్దతు.. కానీ ఒక్క షరతు!
Follow Us On : WhatsApp

