కలం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన జట్టు ఏదైనా ఉందంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అనే చెప్పాలి. హోం గ్రౌండ్‌లో కూడా అత్యంత దారుణమైన ఆటతో వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది ఈ జట్టు. దీంతో ప్రస్తుతం ఈ జట్టు పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా మారింది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆ జట్టు ప్లేఆఫ్ ఆశలను దాదాపు ఆవిరి చేసింది. స్టేడియం అంతా హోమ్ టీమ్ రంగుల కంటే పసుపు రంగు జెర్సీలతోనే నిండిపోవడం, సొంత గడ్డపై ఢిల్లీకి మద్దతు కరువైందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ, గత ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలవగలిగింది.
అంచనా తప్పిన వ్యూహం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. పిచ్ నెమ్మదిస్తుందని కెప్టెన్ అక్షర్ పటేల్ భావించగా, అందుకు విరుద్ధంగా బ్యాటింగ్‌కు సహకరించింది. ట్రిస్టన్ స్టబ్స్ (38), సమీర్ రిజ్వీ (40) పోరాడటంతో ఢిల్లీ 155 పరుగులు చేయగలిగింది. కానీ, ఈ లక్ష్యాన్ని చెన్నై బ్యాటర్లు సంజు శాంసన్ (87), కార్తీక్ శర్మ (41 నాటౌట్) ఊపిరి తీసుకోనివ్వకుండా ఛేదించేశారు. వీరిద్దరి మధ్య నమోదైన 114 పరుగుల అజేయ భాగస్వామ్యం ఢిల్లీ బౌలింగ్ వైఫల్యాన్ని ఎత్తిచూపింది.
శాపంలా మారిన పరిస్థితులు
ఢిల్లీ (Delhi Capitals) వైఫల్యానికి ప్రధాన కారణం వారి హోమ్ గ్రౌండ్ రికార్డే. ఈ సీజన్‌లో సొంత మైదానంలో ఆ జట్టు కేవలం 20 శాతం విజయాలే నమోదు చేసింది. దీనికి వాతావరణ మార్పులు, పిచ్ అస్థిరత కూడా తోడయ్యాయి. ఒక మ్యాచ్‌లో 500కు పైగా పరుగులు నమోదవుతుంటే, మరో మ్యాచ్‌లో జట్టు 75 పరుగులకే కుప్పకూలుతోంది. ఈ వైవిధ్యమైన పరిస్థితులకు ఢిల్లీ ఆటగాళ్లు అలవాటు పడలేకపోతున్నారు.
సమిష్టి కృషి కరువు: కోచ్ ఆవేదన
జట్టు ప్రదర్శనపై కోచ్ హేమంగ్ బదానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులో నిలకడ లేకపోవడమే ప్రధాన సమస్యని ఆయన పేర్కొన్నారు. ఒకరోజు బౌలర్లు రాణిస్తే బ్యాటర్లు విఫలమవుతున్నారని, మరోరోజు దానికి భిన్నంగా జరుగుతోందని చెప్పారు. కనీసం 60 నుంచి 70 శాతం మంది ఆటగాళ్లు సమిష్టిగా రాణించినప్పుడే విజయాలు వస్తాయని, ప్రస్తుతం అది జట్టులో లోపించిందని ఆయన వివరించారు. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఢిల్లీ ఆశిస్తోంది.
Read Also: మే 2026లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? భారీ రాబడినిచ్చే టాప్ ఎస్‌ఐపీలు ఇవే!
Follow Us On : WhatsApp

