ప్రైజ్ మనీ పెంచకపోతే టోర్నీలు బహిష్కరిస్తాం: సబలెంక

కలం, వెబ్‌డెస్క్: టెన్నిస్ (Tennis) ప్రపంచంలో ‘ప్రైజ్ మనీ’ మంటలు కారుచిచ్చులా అంటుకుంటున్నాయి. తాజాగా ఇదే అంశంపై వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ అర్యానా సబలెంక (Aryna Sabalenka) చేసిన ప్రకటన ఈ మంటలను మరింత ఉధృతం చేశాయి. గ్రాండ్ స్లామ్ టోర్నీల ద్వారా వచ్చే ఆదాయంలో ఆటగాళ్లకు ఇచ్చే వాటాను పెంచకపోతే, ఏకంగా టోర్నీలనే బహిష్కరిస్తామని సబలెంక హెచ్చరించారు.

ముఖ్యంగా మే 24 నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించిన ప్రైజ్ మనీ పంపిణీపై ఆమెతో పాటు జానిక్ సిన్నర్ (Jannik Sinner) వంటి టాప్ ప్లేయర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఇటాలియన్ ఓపెన్ సందర్భంగా తన 28వ పుట్టినరోజు జరుపుకున్న సబలెంక, ఆటగాళ్ల హక్కుల గురించి గళమెత్తారు. ఆటగాళ్లు లేకపోతే అసలు టోర్నీలే ఉండవని, ప్రేక్షకులకు వినోదం అందదని ఆమె గుర్తుచేశారు. ఆదాయంలో తమకు దక్కాల్సిన గౌరవప్రదమైన వాటా కోసం పోరాడటం అవసరమని, ఒక దశలో టోర్నీని బహిష్కరించడమే తమ ముందున్న ఏకైక మార్గమని ఆమె (Aryna Sabalenka) అభిప్రాయపడ్డారు.

ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఈ ఏడాది మొత్తం ప్రైజ్ మనీని 10 శాతం (సుమారు 61.7 మిలియన్ యూరోలు) పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే, లోతుగా పరిశీలిస్తే టోర్నీకి వచ్చే మొత్తం ఆదాయంలో ఆటగాళ్ల వాటా తగ్గిందని టాప్-10 ప్లేయర్లు ఆరోపిస్తున్నారు. 2024లో ఆటగాళ్ల వాటా 15.5 శాతంగా ఉండగా, 2026 నాటికి అది 14.9 శాతానికి పడిపోనుందని వారు గణాంకాలతో సహా వివరించారు. తమ వాటాను 22 శాతానికి పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రైజ్ మనీతో పాటు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, పెన్షన్ ప్లాన్లు కూడా కావాలని ఆటగాళ్లు కోరుతున్నారు.

డబ్ల్యూటీఏ, ఏటీపీ సంస్థలు కల్పిస్తున్న ప్రయోజనాలను గ్రాండ్ స్లామ్ నిర్వాహకులు అందించడం లేదని ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పావోలిని విమర్శించారు. అయితే, టోర్నీని బహిష్కరించడం అనేది చాలా కఠినమైన నిర్ణయమని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇగా స్వైటెక్ సూచించారు.

Read Also: వినేశ్ ఫోగట్‌కు ఐటీఏ షాక్.. గొండా టోర్నీకి ముందే వార్నింగ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>