కలం, సూర్యాపేట: రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడినిచ్చే ఆయిల్ పామ్, ఉద్యాన పంటల వైపు మళ్లాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (Sarvotham Reddy) పిలుపునిచ్చారు. తద్వారా ‘సూర్యాపేట ఫ్రెష్’ అనే ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించి, జిల్లా రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట (Suryapet)లోని స్టార్ బాంకెట్ హాల్లో నిర్వహించిన ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ పామ్ సాగు చేయడం ఎంతో ఉత్తమమని సూచించారు. ఎన్.ఎం.ఈ.ఓ-ఓ.పి పథకం కింద మొక్కలు, ఎరువులు, బిందు సేద్యం కోసం మొదటి నాలుగేళ్లలో రైతులకు రూ. 50,918 రాయితీ అందుతుందన్నారు. ఒక మొక్కకు రైతు కేవలం రూ. 20 చెల్లించాల్సి ఉంటుందని, జిల్లాకు కేటాయించిన కంపెనీలే గెలలను కొనుగోలు చేస్తాయన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం.. గెలలు విక్రయించిన 14 రోజుల్లోనే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన ధర కల్పించేందుకు జిల్లాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే 15 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు.
కోల్డ్ స్టోరేజీల సౌకర్యం కల్పిస్తాం
పంటను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీల సౌకర్యం కల్పిస్తామని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (Sarvotham Reddy) తెలిపారు. కోటపహాడ్ రైతుల కోరిక మేరకు మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ‘నేను స్వయంగా తుంగతుర్తిలోని నా వ్యవసాయ క్షేత్రంలో 25 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నానని, అలాగే 2012 నుండి మా అమ్మ పేరు మీద డైరీ ఫామ్ నిర్వహిస్తున్నా’ అని చెప్పారు. సాగులో ఉన్న సాధకబాధకాలు తనకు తెలుసు కాబట్టే, రైతులు లాభసాటి పంటల వైపు రావాలని కోరుతున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాసం లింగా రెడ్డి, వైస్ చైర్మన్ పంతంగి మల్సూర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, తూముల సురేశ్ రావు, ధారవత్ వీరన్న నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగయ్య, ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జి అలీం, కేవీకే సైంటిస్టులు, అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఒక్కడే దిక్కయితే ఎలా?.. చెన్నైకి సెహ్వాగ్ వార్నింగ్!
Follow Us On : WhatsApp

