లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లోనే ఘోరం!

కలం, ఖమ్మం బ్యూరో: లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఖమ్మం (Khammam) జిల్లా ఏదులాపురం బైపాస్ రోడ్డులో ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. వరంగల్ క్రాస్ రోడ్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు లారీ కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

​పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నామవరం గ్రామానికి చెందిన గోపి స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ వాహన షోరూమ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రోజువారీ పని నిమిత్తం తన యూనికాన్ బైక్‌పై బయలుదేరిన గోపి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ బైపాస్‌లో ఉన్న బిలీఫ్ ఆస్పత్రి సమీపంలో టర్నింగ్ దాటుతున్నాడు. ​అదే సమయంలో నాయుడుపేట వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంతో వచ్చి గోపి ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గోపి వాహనంపై నుంచి కిందపడిపోగా, లారీ చక్రాలు ఆయన శరీరంపై నుంచి దూసుకెళ్లాయి. నడుము కింది భాగం తీవ్రంగా నలిగిపోవడంతో గోపి తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

​సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన అధికారులు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ​రోజూలాగే పనికి వెళ్లిన గోపి ప్రమాదంలో మృతిచెందారనే వార్త వినడంతో నామవరం గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>