కలం వెబ్ డెస్క్ : దళపతి విజయ్(Vijay) నటించిన ‘జన నాయగన్’(Jana Nayagan) సినిమాను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్ట్(Supreme Court) గురువారం తిరస్కరించింది. ఈ వ్యవహారాన్ని మద్రాస్ హైకోర్ట్ పరిష్కరించాలని స్పష్టం చేస్తూ జనవరి 20న విచారణకు ఆదేశించింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు వేగంగా విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి సిద్ధంగా లేనట్లు సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా ఆయనపై కుట్రలో భాగంగానే ఈ సినిమాను ఆపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయ్ ఇకపై సినిమాల్లో నటించబోనని, ఇదే తన చివరి సినిమా అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ‘జన నాయగన్’ ఎప్పుడు విడుదల అవుతుందోనని విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.


