కలం, వెబ్ డెస్క్ : భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డారిల్ మిఛెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 117 బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే తమ జట్టు విజయానికి మిఛెల్ కారణం కాదని న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ (Michael Bracewell) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. క్రిస్టియన్ క్లార్క్ చూపించిన అసాధారణ బౌలింగ్‌తోనే విజయం సాధించగలిగామని బ్రేస్‌వెల్ వెల్లడించాడు. భారత జట్టును తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడం వల్లే సగం మ్యాచ్ అప్పుడే తమవైపు వచ్చిందని బ్రేస్ వెల్ అన్నాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే బ్రేస్‌వెల్(Michael Bracewell) జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ప్రతి ఆటగాడు తన పాత్రను చక్కగా పోషించిన ఫలితమని చెప్పాడు. ఇన్నింగ్స్ విరామ సమయంలో జట్టులో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించిందని వెల్లడించాడు.
బౌలింగ్‌లో ఇది కివీస్ చూపించిన ప్రత్యేక ప్రదర్శన అని బ్రేస్‌వెల్ చెప్పుకొచ్చాడు. లక్ష్యం ఎంత ఉన్నా ఛేదించగలమన్న నమ్మకం తమకు ఉందని స్పష్టం చేశాడు. భారత బౌలర్లు గట్టిగా పోరాడినా తమ బ్యాటర్లు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని ఆడారని ప్రశంసించాడు. డారిల్ మిచెల్, విల్ యంగ్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా తమవైపు తిప్పేశారని అన్నాడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయమని తెలిపాడు. మారుతున్న కండిషన్స్‌ను బ్యాటర్లు బాగా చదివారని చెప్పాడు.


