epaper
Tuesday, November 18, 2025
epaper

అక్కడ వీధి కుక్కలు కనిపించొద్దు.. 8 వారాలే గడువు

వీధి కుక్కల(Stray Dogs) బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రాంగణాల సమీపంలో వీధి కుక్కలు తిరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇందుకోసం 8 వారాల గడువు ఇస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది.

దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు దృష్టి సారించిన విషయం తెలిసిందే. పెరుగుతున్న రేబిస్‌ కేసులు, పిల్లలు, పెద్దలపై తరచుగా జరుగుతున్న దాడులు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, అత్యున్నత న్యాయస్థానం స్పందించింది.

షెల్టర్లకు తరలించాలి

వీధి కుక్కలను సురక్షిత షెల్టర్లకు తరలించాలని, దానికోసం గరిష్టంగా 8 వారాల గడువు ఇచ్చింది. తరలింపు చర్యలను పర్యవేక్షించేందుకు స్థానిక సంస్థలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించింది. కుక్కలు తిరిగి ఆ ప్రాంగణాల లోపలికి ప్రవేశించకుండా కంచెలు వేయడం, గేట్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టడం తప్పనిసరి అని పేర్కొంది. అలాగే ఆ ప్రదేశాల్లో క్రమానుసారంగా తనిఖీలు జరిపి కుక్కలు లేవని నిర్ధారించుకోవాలని ఆదేశించింది.

తిరిగి వదిలేయొద్దు

ఏ కారణం చేతనైనా, ఒకసారి షెల్టర్లకు తరలించిన కుక్కలను మళ్లీ పాత ప్రదేశంలో వదిలివేయరాదని కోర్టు కఠినంగా స్పష్టం చేసింది. ఇది పూర్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయమని తీర్పులో పేర్కొంది. వీధి కుక్కల(Stray Dogs)తో పాటు జాతీయ రహదారులపై తిరుగుతున్న ఆలనాపాలనా లేని పశువులు ప్రమాదాలకు దారితీస్తున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని కూడా షెల్టర్లకు తరలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రహదారుల శాఖ, స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. హైవేలపై గస్తీ బృందాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించింది.

కేసు నేపథ్యం

ఇటీవలి నెలల్లో ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో రేబిస్‌ కేసులు పెరగడం, కుక్కల దాడుల వల్ల పలు మరణాలు సంభవించడంతో ప్రజల్లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు(Supreme Court) జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం గత ఆగస్టు 11న 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది.

జంతుప్రేమికుల అభ్యంతరం

ప్రేమికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వీధి కుక్కలను పూర్తిగా దూరం చేయడం పర్యావరణ సమతుల్యతకు హానికరమని, వ్యాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌ చేసిన తర్వాత వాటిని తిరిగి తమ ప్రాంతాల్లో విడిచిపెట్టడం అవసరమని వాదించాయి. ఈ నేపథ్యంలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్వీ అంజరియాలతో కూడిన మరో త్రిసభ్య ధర్మాసనం ఆ అంశాన్ని మళ్లీ పరిశీలించింది. ఆగస్టు ఆదేశాలను కొంతవరకు సవరించి, రేబిస్‌ లక్షణాలు ఉన్న లేదా విపరీత ప్రవర్తన కనబరుస్తున్న కుక్కలు తప్ప మిగతా వాటిని విడిచిపెట్టొచ్చని తెలిపింది.

మరోసారి కఠిన ఆదేశాలు

అయితే తాజా విచారణలో సుప్రీంకోర్టు మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన కుక్కలను వెనక్కి విడిచిపెట్టకూడదని స్పష్టం చేసింది. వాటికి ఆహారం అందించేందుకు స్థానిక సంస్థలు ప్రత్యేక ఫీడింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 13, 2026కు వాయిదా వేసింది.

Read Also: హైదరాబాద్‌లో మరో గ్రాండ్ ఈవెంట్

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>