జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి ఓ అగ్నిపరీక్షలా మారింది. అందుకే ఈ ఎన్నికను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)ను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ తొలుత దూకుడుగా కనిపించింది. బీసీ అభ్యర్థిని ప్రకటించడం.. బస్తీ వాసుల్లో నవీన్ యాదవ్ కుటుంబానికి ఉన్న పట్టు, ఎంఐఎం మద్దతు తదితర అంశాలు తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్ భావించింది. బీఆర్ఎస్ సానుభూతినే నమ్ముకున్నది. అధికారంలో ఉండటంతో పరిస్థితి తమకే అనుకూలంగా ఉంటుందని సీఎం భావించారు. కానీ రానురాను పరిస్థితుల్లో ఎందుకో కొంత మార్పు వస్తోంది. సర్వేలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చాయి. పైగా నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటూ బీఆర్ఎస్ తెలివిగా ప్రచారం చేయడం.. హైడ్రా విషయంలోనూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతిబంధకంగా మారాయి.
కలిసికట్టుగా పనిచేస్తారా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలే, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా? అన్న అనుమానం కలుగుతోంది. సర్వేలు కొంత క్యాడర్‌ను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికలో విజయం సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి ఎంతో ముఖ్యం. అలాగే మంత్రులకు కూడా.. కానీ మంత్రులు పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారా? అన్న అనుమానాలు ఉన్నాయి. భట్టి విక్రమార్క ఒకటి రెండు సార్లు ప్రచారంలో కనిపించారు. పీసీసీ చీఫ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇతర మంత్రులు మొక్కుబడిగా ప్రచారానికి వస్తున్నారా? నిజంగానే పనిచేస్తున్నారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
స్థానికంపై ప్రభావం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలోకూడా అంతే ఉత్కంఠ ఉంది. అక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని బెట్టింగ్ లు పెట్టుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు అధికంగా ఉండటం మరో కారణం. ఆంధ్రాప్రాంతానికి చెందిన చాలా మంది జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. దీంతో వారికి ఈ ఎన్నిక విషయంలో ఆసక్తి ఉంది. అయితే బీజేపీ ఈ ఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకున్నదో అర్థం కావడం లేదు. బీజేపీ చీల్చబోయే ఓట్లు కొంతమేర కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చవచ్చు. కానీ బీజేపీ ఏయే ప్రాంతాల్లో ఓట్లను చీలుస్తుందో తేలాల్సి ఉంది.
బస్తీలే ముఖ్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోల్ మేనేజ్ మెంట్ అత్యంత ప్రాధాన్యంగా మారబోతున్నది. ఎన్నిక చివరిరోజు ప్రతి ఒటరును కలుసుకోవడం.. వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లడం కూడా అత్యంత ముఖ్యమైన విషయం. ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకం కాబట్టి కచ్చితంగా డబ్బు, మద్యం ఏరులై పారే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపించే నాటికి బస్తీల్లో డబ్బులు, మద్యం ఏరులై పారే చాన్స్ ఉంది. ఇది కూడా ఎన్నిక విషయంలో ప్రభావం చూపుతుంది. ఇక ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నెగ్గితే అధిష్ఠానం కూడా రేవంత్ విషయంలో కాస్త సంతృప్తికరంగా ఉండొచ్చు. అలా కాకుండా ఫలితం ప్రతికూలంగా వస్తే రేవంత్ పాలన మీద అధిష్ఠానానికి కొంత అనుమానాలు వస్తాయి. అంతేకాకుండా ఈ ఎన్నిక ప్రభావం స్థానిక సంస్థల మీద కూడా ఉండబోతున్నది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Read Also: అక్కడ వీధి కుక్కలు కనిపించొద్దు.. 8 వారాలే గడువు
Follow Us on: Youtube

