హైదరాబాద్‌లో మరో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భాగ్యనగరంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి కోమటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy) తెలిపారు.
దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీ సంస్థతో భాగస్వామ్యంగా ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి(Komatireddy) పేర్కొన్నారు. ఈ మేరకు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇంటర్నేషనల్ స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణతో రాష్ట్రంలోని యువ దర్శకులు, ఫిల్మ్ మేకర్లు, ఫిల్మ్ విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి చక్కటి వేదిక లభించనుంది. ఈ వేడుకలో దేశీయ, అంతర్జాతీయ స్థాయి షార్ట్ ఫిల్మ్‌ల ప్రదర్శనలు ఉండనున్నాయి. ఉత్తమ చిత్రాలకు పురస్కారాలు, సర్టిఫికెట్లు కూడా అందజేయనున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ పునరుద్ధరణ, ఫిల్మ్ సిటీ అభివృద్ధి, కొత్త ప్రతిభకు ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణను సినీ వర్గాలు స్వాగతిస్తున్నాయి. యువ దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, స్క్రీన్ రైటర్లు తమ సృజనాత్మకతను ప్రపంచ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద, ఈ ఫెస్టివల్ ద్వారా తెలంగాణను దేశీయ, అంతర్జాతీయ సినీ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని సమాచారం.
Read Also: హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య
Follow Us on: Youtube

