కలం వెబ్ డెస్క్ : వీధికుక్కల(Stray Dogs)పై సుప్రీం కోర్ట్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల సమస్యపై ఓ కేసు విచారణలో భాగంగా “కుక్క కరవబోయే మూడ్‌లో ఉన్నప్పుడు దాని ప్రవర్తనను ఎవరూ ముందుగా అంచనా వేయలేరు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు, కోర్టు లాంటి సున్నిత ప్రాంతాల్లో వీధి కుక్కలు ఎందుకు ఉండాలన్న ప్రశ్నను సుప్రీంకోర్టు లేవనెత్తింది. అలాంటి ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించడంలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించింది. అయితే ఈ ఆదేశాలు సంస్థాగత ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని, ప్రజా రహదారుల విషయంలో కాదని కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియా లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. వీధి కుక్కల వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని జస్టిస్ విక్రమ్ నాథ్ పేర్కొన్నారు. “ఉదయం ఏ కుక్క ఏ మూడ్‌లో ఉంటుందో ఎవరికీ తెలియదు” అని ఆయన వ్యాఖ్యానించారు. జస్టిస్ సందీప్ మెహతా మాట్లాడుతూ, రహదారులు వేరు, కోర్టులు, పాఠశాలలు, ఆసుపత్రులు వేరు అని స్పష్టం చేశారు. ఈ సంస్థాగత ప్రదేశాలు భద్రంగా ఉండాలని, ఇక్కడ వీధి కుక్కల అవసరం ఏముందని ప్రశ్నించారు.
గతంలో 2025 నవంబర్‌లో సుప్రీం కోర్టు పాఠశాలలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లలో కుక్క కాటు ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సందర్భంగా వీధి కుక్కలను స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసిన తర్వాత ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అనంతరం వాటిని పట్టుకున్న ప్రదేశాలకు తిరిగి వదిలేయాలని సూచించింది. అలాగే రాష్ట్ర, జాతీయ రహదారుల్లో పశువులు, ఇతర జంతువులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది. వీధి కుక్కల సమస్యపై ముందస్తు నివారణే ముఖ్యమని, కేవలం ప్రవర్తన ఆధారంగా ప్రమాదకర కుక్కలను గుర్తించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read Also: ఛత్తీస్‌గఢ్‌లో 26 మంది మావోయిస్టుల లొంగుబాటు
Follow Us On : WhatsApp


