కలం వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలోని సుక్మా జిల్లా(Sukma district)లో బుధవారం పోలీసులకు 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు(Maoists Surrender). వీరిలో 7 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం రూ.64 లక్షల వరకు రివార్డ్(Reward) ఉందని వెల్లడించారు. ఈ మావోయిస్టులు మాడ్ డివిజన్, పీఎల్‌జీఏ విభాగాల్లో పని చేస్తూ సుక్మా, మాడ్ ప్రాంతం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా అటవీ ప్రాంతాల్లో చురుకుగా పని చేస్తూ భద్రతా బలగాలకు సవాల్‌గా మారినట్లు తెలిపారు.
సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధాన ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు. హింసా మార్గాన్ని విడిచి, సాధారణ జీవితం వైపు రావాలని మిగిలిన మావోయిస్టులకు ఆయన పిలుపునిచ్చారు. మావోయిస్టుల లొంగుబాటుతో సుక్మా జిల్లాలో శాంతి భద్రతలు మరింత మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


