బెంగాల్‌లో ఓట్ల తొల‌గింపుపై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో స‌ర్ (SIR) ప్ర‌క్రియ‌తో ఓట‌ర్ల జాబితాలో పేరు కోల్పోయిన వారు వేసిన అప్పీళ్ల‌పై నేడు సుప్రీం కోర్టు (Supreme Court)లో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌శ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై సుప్రీం కోర్ట్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దేశ పౌరుడిగా ఓటర్ల జాబితాలో ఉండటం అనేది ప్ర‌తి ఒక్క‌రికి నిరంతర హక్కు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్ప‌ష్ట చేసింది. ఇది కేవ‌లం రాజ్యాంగపరమైన హక్కు మాత్రమే కాకుండా వ్య‌క్తిగ‌త భావోద్వేగంతో కూడుకున్న అంశ‌మ‌ని పేర్కొంది. దీన్ని కాపాడాల్సిన బాధ్య‌త అధికారుల‌పై ఉంద‌ని సూచించింది. ఎన్నికల హడావుడిలో పడిపోయి గుడ్డిగా వ్యవహరించ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించింది.

దేశంలో ఓట‌ర్ల జాబితాలో పేరు కోల్పోయిన వారు త‌మ‌ అప్పీళ్లు ఇప్ప‌టికీ పెండింగ్‌లోనే ఉన్నాయ‌ని, ఒక వేళ స‌ద‌రు అప్పీళ్ల‌లో వారు గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. దీని కోసం ఓట‌ర్ల జాబితా గ‌డువు పెంచాల‌ని వారు కోర్టుకు విన్న‌వించారు. బెంగాల్‌లో స‌ర్ ప్ర‌క్రియ‌పై మొద‌టి నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. దీనిపై కోర్టు సైతం తీవ్ర స్థాయిలో మండిప‌డింది. ఎన్నికల కమిషన్ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన నియమాలను బెంగాల్‌లో (Bengal) పాటించలేదని కోర్టు వేలెత్తి చూపింది. ముఖ్యంగా ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ అనే కొత్త వర్గాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడంపై ధర్మాసనం ప్రశ్నించింది. 2002 నాటి ఓటర్ల జాబితాలో ఉన్నవారు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని గతంలో బీహార్ కేసులో ఎన్నిక‌ల క‌మిష‌న్‌ చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఓట‌రు జాబితాల‌కు సంబంధించి రోజుకు వేల సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు వ‌స్తే వాటిని ప‌రిశీలించే క్ర‌మంలో అధికారులు పొరపాట్లు చేసే అవకాశం ఉందని, అందుకే అప్పీళ్లను పరిష్కరించడానికి ఒక పటిష్టమైన యంత్రాంగం ఉండాలని ధ‌ర్మాస‌నం (Supreme Court) అభిప్రాయ‌ప‌డింది.

Read Also: ప్రభుత్వ ఉద్యోగం పేరుతో కోట్ల కట్నం డిమాండ్.. ఘరానా మోసగాడి అరెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>