ప్రభుత్వ ఉద్యోగం పేరుతో కోట్ల కట్నం డిమాండ్.. ఘరానా మోసగాడి అరెస్ట్

కలం, నల్లగొండ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగం పేరుతో అమాయక యువతులను, వారి కుటుంబాలను బురిడీ కొట్టిస్తున్న ఓ కిలాడీ పెళ్లికొడుకు ఉదంతం నగరంలో కలకలం రేపింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లో మేనేజర్‌ గా పనిచేస్తున్నట్లు నమ్మించి, కోట్లలో వరకట్నం (Dowry Fraud) డిమాండ్ చేసిన నిందితుడిని చైతన్యపురి పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన పనస మధు అనే వ్యక్తి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మోసాలకు తెరలేపాడు. తాను ఎఫ్‌సీఐ చర్లపల్లి విభాగంలో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని నమ్మబలికాడు.

తన అబద్ధం నిజమనిపించేలా నకిలీ ఐడీ కార్డులను కూడా సృష్టించాడు. ఈ క్రమంలో ఒక యువతి కుటుంబంతో పరిచయం పెంచుకున్న మధు.. పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. పెద్ద హోదాలో ఉన్నానని నమ్మించి ఏకంగా రూ. 2 కోట్లు వరకట్నం (Dowry Fraud) డిమాండ్ చేశాడు. చివరకు రూ. 1.5 కోట్లకు ఒప్పందం కుదరడంతో ఇరు కుటుంబాల మధ్య నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. నిశ్చితార్థం ముగిసిన తర్వాత, ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ ఉందంటూ యువతిని తన గదికి పిలిపించాడు.

అక్కడ ఆమెపై లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితురాలు.. రహస్యంగా అతను పనిచేస్తున్నానని చెప్పిన ఆఫీసులో విచారణ చేపట్టింది. అక్కడ మధు జాబ్ చేయడం లేదని.. చూపించినవన్నీ నకిలీ ఐడీ కార్డులని తెలియడంతో షాక్‌కు గురై పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు నిందితుడు పనస మధును అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతని వద్ద నుంచి రెండు నకిలీ ఎఫ్‌సీఐ ఐడీ కార్డులు, On Govt Duty స్టిక్కర్ ఉన్న కారు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>