సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లపై(BC Reservations) నేడు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టి వేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్(BC Reservations) ను 42% ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కి విక్రమ్ నాథ్ బెంచ్ సూచించింది. హైకోర్టులో విచారణలో ఉండగా, సుప్రీంకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. అనంతరం వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ ని డిస్మిస్ చేసింది.

