కలం, తెలంగాణ బ్యూరో : ప్రతి నెలా మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో రుతుక్రమ ఆరోగ్యం (Menstrual Hygiene) కూడా ఒక భాగమని నొక్కిచెప్పింది. రుతుక్రమ ఆరోగ్యం మహిళల పునరుత్పత్తికి సంబంధించిన ఆరోగ్య లక్షణమని, ఇది ఒక సామాజిక అంశమని, ఇది ఒక ప్రాథమిక హక్కు కూడా అని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 6-12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్ పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. కోట్లాది మంది బాలికలు, యువతులు, మహిళల ఆరోగ్యం విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఒక పిటిషన్‌కు సంబంధించిన విచారణపై పై స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సరైన వసతులు లేని కారణంగా బాలికలు చదువుకు దూరం కాకూడదని, ఇది వారి గౌరవం, డిగ్నిటీకి సంబంధించిన అంశమని స్పష్టత ఇచ్చింది. మరో రకంగా దేశంలో అమలవుతున్న విద్యాహక్కు చట్టం కూడా ప్రతీ ఒక్కరికీ విద్య అందాలని నొక్కిచెప్తున్నదని సుప్రీం కోర్టు (Supreme Court) గుర్తుచేసింది.
సౌకర్యాల లేమి గౌరవాన్ని భగ్నం చేయడమే :
మహిళలు ప్రతి నెలా ఎదుర్కొనే రుతుక్రమ సమస్యలు ప్రకృతి, ఆరోగ్యానికి సంబంధించిన అంశమని బెంచ్ వివరించింది. వారి మంత్లీ పీరియడ్స్ సమయంలో విద్యాసంస్థల్లో సరైన సౌకర్యాలు లేకపోతే వారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని పేర్కొన్నది. ప్రతీ పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేక టాయ్‌లెట్లు, నీటి సౌకర్యం, శానిటరీ న్యాప్‌కిన్ ప్యాడ్‌ల పంపిణీ కోసం వెండింగ్ యంత్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అనేక రాష్ట్రాల్లో చదువుకుంటున్న బాలికలు, యువతులు ఎదుర్కొంటున్న ఈ సమస్య అనేక సందర్భాల్లో న్యాయస్థానాలకు ఎక్కిందని, కొన్న స్వచ్ఛంద సంస్థలు కూడా దీనిపై పనిచేస్తున్నాయని గుర్తుచేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పు కేవలం ఈ న్యాయస్థానం గదులకే పరిమితం కాకూడదని, పాఠశాలల్లో సాయం అడగడానికి సంకోచించే బాలికలకు, తగిన వసతులు, వనరులు లేని కారణంగా ఇబ్బంది పడుతున్న టీచర్లకు అండగా నిలవాలి అని ఇద్దరు జడ్జీలు వ్యాఖ్యానించారు.
సిగ్గుపడాల్సిన అంశం కాదు ఇది :
బాలికలు, యువతులు, మహిళలు ప్రతి నెలా ఎదుర్కొనే ఈ సమస్య దురదృష్టవశాత్తూ ఒక రహస్యమైన అంశంగానే ఉండిపోయిందని, అలాంటి భావన మహిళల్లో నెలకొన్నదని బెంచ్ గుర్తుచేసింది. బాలికలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యనించింది. రుతుక్రమ సమస్య కారణంగా స్కూలుకు, కాలేజీకి వెళ్ళలేకపోతున్న బాలికలకు మేం ఒక్కటి చెప్పదల్చుకున్నాం. “మీ శరీరం మీకు భారం కాదు.. ఇందులో మీ తప్పు ఏమీ లేదు.. మీకు అండగా నిలవాల్సిన బాధ్యత ఈ సమాజానిది… కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మెన్‌స్ట్రువల్ హైజీన్ పాలసీ’ అన్ని రాష్ట్రాల్లో పకడ్బందీగా అమలు కావాలి.. ఇందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చేపట్టాలి..” అని బెంచ్ తన తీర్పులో ఉదహరించింది.


