మహిళకు ఇష్టంలేని గర్భాన్ని కొనసాగించమని ఆదేశించలేం : సుప్రీం

కలం, వెబ్​డెస్క్​: ‘అవాంఛిత గర్భం’ కొనసాగించమని మహిళను, మరీ ముఖ్యంగా మైనర్​ను న్యాయవ్యవస్థ ఆదేశించలేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను తల్లిగా మారాలని బలవంతపెట్టలేమని చెప్పింది. మైనర్​గా ఉండగా గర్భం దాల్చి, ప్రస్తుతం 30 వారాల గర్భంతో ఉన్న ఓ బాలికకు అబార్షన్​ చేయించడంపై దాఖలైన పిటిషన్​ను​ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్​ బీవీ నాగరత్న , జస్టిస్​ ఉజ్జల్​ భుయాన్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఓ బాలుడి వల్ల సదరు మైనర్​ బాలిక గర్భం దాల్చిందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అది పరస్పర సమ్మతితో జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, బాలికకు ఈ బిడ్డను కనడంపై ఇష్టం లేదనేదే ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులో మైనర్​ బాలిక హక్కులే అత్యంత ప్రాధాన్యం కలిగినవని వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఈ బాలిక మైనర్​ కావడం వల్ల ఆ గర్భం కూడా చట్టపరంగా సరైనది కాదని వ్యాఖ్యానించింది (Supreme Court). బాలిక గర్భాన్ని తొలగించేందుకు అనుమతిస్తూ తీర్పు చెప్పింది.

‘ఈ విషయంలో ఇరు పక్షాల వాదనలు బలంగా ఉన్నాయి. అయితే, ఈ దురదృష్టకర పరిస్థితిని ఎదుర్కొంటున్న మైనర్​ బాలికకు గర్భాన్ని కొనసాగించాలా? వద్దా? అనే దానిపై ఆ బాలికకు ఉన్న హక్కునే ప్రధానంగా పరిగణించాలి. తల్లి పునరుత్పత్తి స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. గర్భాన్ని కొనసాగించాలనే ఉద్ధేశ్యం మహిళకు లేకపోతే, ఆమెను బలవంతం చేయలేం. అప్పీలెంట్‌ తరఫు న్యాయవాదుల వాదనలను మేం అంగీకరిస్తున్నాం. బాలికకు వైద్యపరమైన గర్భస్రావానికి అనుమతి ఇస్తున్నాం’ అని కోర్టు తెలిపింది.

బాలికకు గర్భస్రావం చేయించే ప్రక్రియను ముంబైలోని జేజే (JJ) ఆస్పత్రిలో, అన్ని వైద్య నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ఆదేశించింది. అయితే గర్భస్రావానికి సమ్మతిస్తూ బాలిక తరఫున రాతపూర్వక అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read Also: కానిస్టేబుల్ కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియా

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>