కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ (Karimnagar) లో విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు చెందిన కార్పొరేటర్లు, సర్పంచులకు స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒకరోజు కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుడా చైర్మన్ (SUDA Chairman) కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. విద్యా రంగ అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. దేశాభివృద్ధికి విద్యాభివృద్ధే పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ అందజేస్తున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహార పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అల్పాహారం లేకుండా పాఠశాలకు వచ్చే పిల్లలకు పాఠాలు సరిగా అర్థంకాకపోయే పరిస్థితి ఉంటుందని చెప్పారు.
పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయడం, ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించడం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ఆవరణలో విద్యా సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు స్కూల్ కిట్‌లు, స్టెమ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు చేయూత అందించాలని సర్పంచులు, కార్పొరేటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కుందారపు మహేశ్వర్, డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య, మండల విద్యాధికారులు ఆనందం, బద్రయ్య, వాసవి, జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి, జీసీడీఓ ఉమ, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

