డిండి అభివృద్ధిపై ఎమ్మెల్యే బాలు నాయక్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

కలం, దేవరకొండ : డిండి మండలంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే (Devarakonda MLA) నేనావత్ బాలు నాయక్ (Nenavath Balu Naik) స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమీక్షా సమావేశంలో వివిధ శాఖల పనితీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

గ్రామాల ప్రగతి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి రైతుకూ వెంటనే భూ పట్టాలు అందించాలని, కొత్తగా పట్టాలు పొందిన రైతులు ‘రైతు భరోసా’, ‘రైతు బీమా’తో పాటు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను వేగంగా పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. భూమి ఉన్న ఏ ఒక్క అర్హ రైతుకూ ప్రభుత్వ ఫలాలు దూరమవ్వడానికి వీల్లేదని పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టు (Dindi Project) నుంచి వ్యవసాయానికి నీటిని విడుదల చేశామని, రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

‘మిషన్ భగీరథ’ ద్వారా ప్రతి గ్రామానికి నిరంతరంగా సురక్షిత తాగునీరు అందాలని, పైప్‌లైన్, మోటార్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కింద జలసిరి పనులతో పాటు గొర్రెలు, బర్ల షెడ్లు, పండ్ల తోటల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలి. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకందారులకు మెరుగైన వైద్య సేవలు, టీకాలు అందిస్తూ వారి ఆదాయం పెంచేలా పశు సంవర్ధక శాఖ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మండలంలో గుర్తించిన 45 గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణంలో స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగుల లోపు ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ బాధితులు తదితర అర్హులైన వర్గాలందరికీ నిబంధనల ప్రకారం పెన్షన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

నల్లగొండ నుంచి డిండి వరకు హామ్ రోడ్డు పద్ధతిలో చేపట్టే డబుల్ రోడ్డు నిర్మాణ పనులను మొదటి విడతలోనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇది పూర్తయితే ప్రాంతీయ రవాణా రూపురేఖలు మారతాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఎలాంటి జాప్యం వహించకూడదని ఎమ్మెల్యే బాలు నాయక్ (MLA Balu Naik) హెచ్చరించారు.

Also Read : 51 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా? హకీ ప్రపంచకప్‌పై భారత్ గురి!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>