కలం, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం మండలం కేసరపల్లిలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల (Sri Chaitanya College)లో విషాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన యశ్వంత్ కుమార్ అనే విద్యార్థి కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 940 మార్కులు సాధించిన యశ్వంత్, బెటర్మెంట్ కోసం అదే కళాశాలలో మళ్లీ చేరాడు. అయితే కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేకే తన కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలేజీ యాజమాన్యం మీడియాను లోపలికి అనుమతించకుండా గేట్లు వేసి అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ ఘటనలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం మానవత్వం లేకుండా, కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను సైతం లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు బయటకు ఈడ్చిపారేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. యాజమాన్యానికి కొమ్ముకాస్తూ వాస్తవాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువులో రాణిస్తున్న విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

