కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల (Mancherial) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట (Luxettipet) మున్సిపాలిటీ పరిధిలో ఈదురుగాలుల (Strong Winds) బీభత్సానికి నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. పంటను కాపాడుకునేందుకు వెళ్లిన వారు తిరిగి రాని ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. లక్షెట్టిపేట (Luxettipet) కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యంపై టార్పాలిన్ కప్పేందుకు రైతులు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో వారు సమీపంలోని గోడ పక్కన నిలబడ్డారు. అయితే గాలుల తీవ్రతను తట్టుకోలేక ఆ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మరో ఘటనలో గంపలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద రేకుల షెడ్డు కూడా ఈదురుగాలుల ప్రభావంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పంటను కాపాడుకోవాలన్న ఆత్రుతతో వెళ్లిన రైతులు ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. మృతుల కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ఘటన స్థలాలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఈదురుగాలులు, వర్షాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారు
Follow Us On : WhatsApp

