కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల ముఖచిత్రాన్ని మారుస్తామని, మౌలిక వసతుల కల్పనలో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్పే రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) సొంత ఇలాఖాలోనే రోడ్ల అభివృద్ధి పడకేసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ప్రత్యేక చొరవతో రూ.200 కోట్లకుపైగా భారీ రోడ్ల ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు సాధించి జీఓలు జారీ చేయించారు. కానీ క్షేత్రస్థాయిలో పనుల పురోగతి లేదు. శంకుస్థాపనలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రధాన రోడ్లు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. నిత్యం వేలాది మంది వాహనదారులు, రోడ్డు పక్కన గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో తీవ్ర జాప్యం
మంత్రి హోదాలో నల్లగొండకు పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 200 కోట్లకు పైగా నిధులతో రోడ్డు విస్తరణ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. స్వయంగా జీవోలు విడుదల చేశారు. కానీ, నేటికీ ఆ పనులు తుది దశకు చేరుకోకపోవడం గమనార్హం. నల్లగొండ నుంచి ముశంపల్లి మీదుగా 27.2 కిలోమీటర్ల రోడ్డును విస్తరించి బీటీ డబుల్ లేన్‌గా మార్చేందుకు రూ. 100 కోట్లు కేటాయించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రకటించిన రోడ్డు పనులు ఇవి. కానీ, ఇప్పటికీ అక్కడ మట్టి తవ్వకాలు, కాల్వల పనులకే పరిమితమైంది. గుంతలు పూడ్చకపోవడంతో వాహనాలు వెళ్లే సమయంలో లేచే దుమ్ముతో రోడ్డు పక్కన గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
నకిరేకల్-వజీరాబాద్ ప్రధాన రోడ్డు నుంచి తిప్పర్తి మండలం మామిడాల, గోదూరిగూడెం, ఎల్లమ్మగూడెం మీదుగా చిరుమర్తి వరకు 25 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ. 65 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అత్యంత కీలకమైన ఈ బీటీ డబుల్ రోడ్డు పనులు కూడా ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే ఉన్నాయి. నల్లగొండ – మునుగోడు ఎక్స్ రోడ్డు నుంచి గుండ్లపల్లి, నర్సింగ్ భట్ల, రేగట్టె మీదుగా చండూరు వరకు 21 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ. 50 కోట్లు కేటాయించారు.
జిల్లా కేంద్రంతో చండూరు, మునుగోడును అనుసంధానించే బీటీ రోడ్డు పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. అసంపూర్తిగా ఉన్న కల్వర్టులు, గోతులు ప్రయాణికులకు మృత్యు మార్గాలుగా మారాయి. అదేవిధంగా చిన్నసూరారం, ఇండ్లూరు, వెంకటాద్రిపాలెం మీదుగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు సైతం పూర్తికాలేదు. కంకర పరిచి వదిలేశారు. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి ఏమిటో?
రోడ్ల శాఖ మంత్రి సొంత నల్లగొండలోనే పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో పనుల పరిస్థితి ఏమిటని ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, నత్తడనకన సాగుతున్న రోడ్డు పనులను వేగవంతం చేసి వాహనదారులకు, ప్రయాణికులకు నిత్య నరకం నుంచి తప్పించాలని నల్లగొండ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

