కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల (Warangal MLAs) కు చెందిన కొందరు అనుచరుల వ్యవహారశైలి రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యేలు దృష్టి సారిస్తుండగా.. వారి పేర్లు చెప్పుకుంటూ కొందరు అనుచరులు భూ దందాలు, వ్యక్తిగత పంచాయితీలు, సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి.
తాజాగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడిగా ప్రచారంలో ఉన్న సారంగపాణి వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బాధితులు గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకుని కొందరు అనుచరులు దందాలకు పాల్పడుతున్నారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
సన్నిహితులమని చెప్పుకుంటూ..
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వీరికి సన్నిహితులుగా చెప్పుకునే కొందరు వ్యక్తుల వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలు వారికి ఇబ్బందికరంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్నామనే పేరుతో కొందరు స్థానికంగా ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చిన్నపాటి వ్యక్తిగత వివాదాల నుంచి భూ తగాదాల వరకు జోక్యం చేసుకుంటూ, “మేమున్నాం” అంటూ వ్యవహారాలు చక్కబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో “సెటిల్మెంట్” పేరుతో వ్యవహారాలు నడిపిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
హెచ్చరించినా .. మళ్లీ అదే తీరు
గతంలో కూడా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి సన్నిహితులుగా చెప్పుకునే కొందరి జోక్యంపై బాధితులు పోలీసులను ఆశ్రయించిన సందర్భాలు ఉన్నట్లు సమాచారం. పలువురిపై కేసులు నమోదైనట్లు ప్రచారం జరిగింది. దీంతో అప్పట్లో ఎమ్మెల్యే తన అనుచరులు, కార్యకర్తలను తీవ్రంగా హెచ్చరించినట్లు రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. “ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలి తప్ప వ్యక్తిగత పంచాయితీలు, వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు” అని ఎమ్మెల్యే స్పష్టం చేసినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కొందరి వ్యవహారశైలిపై ఆరోపణలు రావడం మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తోంది.
రాజకీయంగా ప్రతికూల ప్రభావం
ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని అనుచరులు చేసే వివాదాలతో రాజకీయంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. అనుచరుల వ్యవహారాలపై ఎమ్మెల్యేలు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత పంచాయితీలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల్లో తమ పేరును ఎవరూ దుర్వినియోగం చేయకుండా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
ప్రత్యర్థులకు అస్త్రంగా మారే అవకాశం
ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో అధికార పార్టీ అంతర్గత సమీకరణాలు వేడెక్కుతున్న తరుణంలో అనుచరుల వ్యవహారాలు ఎమ్మెల్యేలకే రాజకీయ తలనొప్పిగా మారితే ప్రత్యర్థులకు అది ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అభివృద్ధి పనులతో ప్రజల మన్ననలు పొందాల్సిన ప్రజాప్రతినిధులకు, అనుచరుల చర్యలు ప్రతికూలంగా మారకుండా పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

