కలం, వెబ్ డెస్క్: తిరుపతి (Tirupati)లోని అలిపిరి (Alipiri) వద్ద మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పోలీసులు సంయుక్తంగా వీధి వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. అలిపిరి పరిసర ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్లను జెడ్పీ, జేసీబీల సాయంతో మున్సిపల్ యంత్రాంగం తొలగించింది. ఈ క్రమంలో జీవనాధారాన్ని కోల్పోతున్నామంటూ స్థానిక మహిళలు, వ్యాపారులు అధికారులను అడ్డుకొని, తమ కడుపు కొట్టవద్దంటూ కన్నీరుమున్నీరుగా వేడుకున్నారు. అయితే, అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బండ్లను పట్టుకునే క్రమంలో అధికారులకు, వ్యాపారులకు మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఆందోళన చేస్తున్న పలువురు బాధితులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
ఈ అనాలోచిత చర్యకు నిరసనగా తమకు న్యాయం చేయాలంటూ వీధి వ్యాపారులు పెద్ద సంఖ్యలో తిరుపతి (Tirupati) మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేరి ఆందోళన చేపట్టారు. ముందస్తు సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా దౌర్జన్యంగా తమ బండ్లను ధ్వంసం చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే అలిపిరి ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, అధికారుల తీరు వల్ల తాము రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి తమకు వ్యాపారాలు చేసుకునేందుకు తగిన స్థలాన్ని కేటాయించి, జీవనోపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
Read Also: జగన్ బాధితుడు కాదు నిందితుడు : మంత్రి పయ్యావుల కేశవ్
Follow Us On : WhatsApp

