కలం, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో అనవసర కాల్స్ ఎక్కువైపోయాయి. మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా ఆఫీస్ మీటింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే అర్జెంట్ ఏమో అని లిఫ్ట్ చేస్తాం. తీరా చూస్తే అవతలి వైపు నుంచి “సార్.. మీకు లోన్ కావాలా?”, “ఫ్రీగా క్రెడిట్ కార్డ్ ఇస్తాం సార్!” అంటూ విసిగిస్తుంటారు. అందరికీ ప్రతీ రోజూ ఇలాంటి కాల్స్ వస్తుంటాయి. ఇలాంటి స్పామ్ కాల్స్ (Spam Calls) కి సింపుల్‌గా చెక్ పెట్టొచ్చు
భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ డీఎన్‌డీ (TRAI DND App) పేరుతో చాలాకాలం క్రితమే ఓ యాప్ తయారు చేసింది. ఈ యాప్ అంతగా ప్రాచుర్యంలో లేదు. DND అంటే ‘డు నాట్ డిస్టర్బ్’ అని అర్థం. అనవసర కమర్షియల్ కమ్యూనికేషన్, అంటే స్పామ్ తగ్గించడానికి ఉపయోగపడే యాప్ ఇది. ఈ యాప్ ద్వారా మొబైల్ యూజర్లు తమ కమ్యూనికేషన్ ప్రిఫరెన్సెస్‌ను నేరుగా నియంత్రించవచ్చు. ప్రమోషనల్ మెసేజ్‌లు, కాల్స్ యూజర్ అనుమతితోనే రావాలి. అవసరమైన సర్వీస్ మెసేజ్‌లు మాత్రం అంతరాయం లేకుండా చేరుతాయి. ఈ యాప్‌కు 10 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ ఉన్నాయి. ఇది భారత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన టూల్‌గా మారింది.
ఈ యాప్ ద్వారా యూజర్ తన కమ్యూనికేషన్‌ను నియంత్రించుకోవచ్చు. టెలికాం నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు యూజర్ అనుమతిని గౌరవించాలి. అన్ని నెట్‌వర్క్‌లలో ఒకే విధమైన ప్రిఫరెన్స్‌లు కొనసాగుతాయి. అనవసర అంతరాయాలు తగ్గుతాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత స్పష్టంగా మారుతుంది. స్పామ్ కాల్స్, మెసేజెస్ తగ్గించడానికి యూజర్లు ట్రాయ్ డీఎన్‌డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. మొబైల్ నంబర్‌ను ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేయాలి. తర్వాత ఫుల్ డీఎన్‌డీ లేదా పాక్షిక డీఎన్‌డీ ఎంపిక చేసుకోవాలి. స్పామ్ కాల్స్, మెసేజ్‌లను యాప్ ద్వారా రిపోర్ట్ చేయాలి. నమ్మకం లేని ప్లాట్‌ఫారమ్‌లలో మొబైల్ నంబర్ షేర్ చేయకూడదు. ఇలా చేస్తే స్పామ్ చాలా వరకు తగ్గుతుంది.

