కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శివార్లలోని చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా (HYDRA) మరో కీలక అడుగు వేసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని ముష్కి చెరువు (Mushkin Cheruvu) రక్షణ కోసం రంగంలోకి దిగింది. ఈ చెరువు పరిధిలో దాదాపు పది ఎకరాల మేర ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విలువైన ఈ చెరువు స్థలాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి, రాత్రికి రాత్రే చదును చేసి హద్దులు సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన హైడ్రా బృందం తక్షణమే చర్యలకు ఉపక్రమించింది.
రియల్టర్లు అక్రమంగా నిర్మించిన హద్దు రాళ్లను, బోర్డులను హైడ్రా సిబ్బంది పూర్తిగా తొలగించారు. ఆక్రమణలు జరిగిన ప్రాంతం మళ్లీ చేతులు మారకుండా ఉండేందుకు చెరువు చుట్టూ ముళ్లకంచెతో ఫెన్సింగ్ వేసే పనులను వేగవంతం చేశారు. గతంలోనే ఈ చెరువు పరివాహక ప్రాంతంలో వెలిసిన గుడిసెలను ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారుల ఆదేశాల మేరకు అప్పట్లోనే చాలామంది నివాసితులు తమ గుడిసెలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రస్తుతం హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ పనులు పకడ్బందీగా చేపడుతుండటంతో, అక్కడ మిగిలి ఉన్న కొద్దిమంది గుడిసెల నివాసితులు కూడా స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్తున్నారు. చెరువుల ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రకృతి వనరులను కాపాడుకుంటామని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

