కలం, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డులో ఒక కీలక మార్పు జరిగింది. ఐసీసీ తన కొత్త ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా డాక్టర్ రోస్ రివాజ్ (Ros Rivaz) ను నియమించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో ఆమె రాక బోర్డుకు ఎంతో బలాన్ని ఇస్తుందని ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. రోస్ రివాజ్ కెరీర్ మొదటి నుండి ఎంతో వైవిధ్యంగా సాగింది. ఆమెకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో, అంతర్జాతీయ సంస్థలలో పనిచేసిన గొప్ప అనుభవం ఉంది.
గతంలో అనేక పెద్ద కంపెనీలలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె (Ros Rivaz), ప్రస్తుతం ఆంగ్లియన్ వాటర్, యూకే కంపెనీస్ హౌస్‌లకు చైర్మన్‌గా ఉన్నారు. అలాగే అపెరామ్ ఎస్ఏ, విక్ట్రెక్స్ పీఎల్‌సీ సంస్థల్లో లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కూడా సేవలందిస్తున్నారు. ఆమె కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాలేదు. సమాజ సేవలోనూ ముందున్నారు. ‘యువర్-లైఫ్’ క్యాంపెయిన్ ద్వారా యువతుల్లో సైన్స్, టెక్నాలజీ (STEM) చదువులను ప్రోత్సహించారు.
సౌతాంప్టన్ యూనివర్సిటీ కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే ‘వాటర్ ఎయిడ్’ వంటి స్వచ్ఛంద సంస్థల్లో చురుగ్గా పాల్గొన్నారు. సంస్థల నిర్వహణలో, వ్యూహాలు రచించడంలో ఆమెకున్న పట్టు బోర్డుకు బాగా ఉపయోగపడనుంది. ఈ నియామకంపై ఐసీసీ చైర్మన్ జై షా సంతోషం వ్యక్తం చేశారు. రోస్ రివాజ్‌ను బోర్డులోకి ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకున్న నాయకత్వ లక్షణాలు, అనుభవం క్రికెట్ ఎదుగుదలకు, సంస్థ బలోపేతానికి ఎంతో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఐసీసీ బోర్డులో చేరడంపై డాక్టర్ రోస్ రివాజ్ స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన క్రికెట్ క్రీడకు సేవలు అందించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. క్రికెట్ కొత్త ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సమాజంలో స్ఫూర్తి నింపుతున్న ఈ తరుణంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు.
Read Also: లోన్, క్రెడిట్ కార్డ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ యాప్‌తో చెక్ పెట్టండి
Follow Us On: Instagram

