Mobile Popup Ad
Mobile Popup Ad

పాలమూరు ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారు: శ్రీనివాస్ గౌడ్

కలం, వెబ్ డెస్క్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru Rangareddy Lift Irrigation Project) అమలుపై రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 15 లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా పడావు పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గత రెండున్నర ఏండ్లు అవుతున్నా.. ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూడా పాలమూరు జిల్లా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.

90 శాతం పనులు పూర్తి చేశాం..

ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు కేసీఆర్ హయాంలోనే 90 శాతం పూర్తి చేశామని.. కేవలం 10 శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) స్పష్టం చేశారు. పంప్ హౌస్ ల నుంచి పంప్ హౌస్ ల వరకు టన్నెలింగ్ వరకు మొత్తం పూర్తయిందని చెప్పారు. కాలువల టెండర్లు కూడా పిలిచి ఖరారు చేశామని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిందని మండిపడ్డారు. ఆ టెండర్లను నిర్ధారించి పనులు పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు రిజర్వాయర్లలో నీళ్లు కళకళలాడుతూ ఉండేదని చెప్పారు.

ఒత్తిడి తీసుకువచ్చేందుకే పాదయాత్ర..

జిల్లా రైతాంగం కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన ప్రతిపక్షంగా తామంతా ఏకమై ఈ ప్రాజెక్టు చేపట్టాలని సర్కార్ పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పాదయాత్ర చేపడుతున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. త్వరలో జరగబోయే పాదయాత్రకు కార్యచరణ రూపొందిస్తున్నామని ప్రకటించగానే రేవంత్ సర్కార్ భయపడి హడావిడిగా ఉమ్మడి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిందన్నారు. ఈ సమీక్షలో కూడా ఉన్నతాధికారులు, ప్రాజెక్టు ఈఎన్సీ ఎవరూ లేకుండా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం అవగాహన ఉందని దీనిపై సమీక్షలో కూర్చున్నారో జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒక్కరోజు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎలా ఉందో చూసినా పాపాన పోలేదని దుయ్యబట్టారు.

ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విశ్రమించేది లేదు..

వచ్చే నెలలో పాదయాత్ర చేసి సర్కార్ పై ఒత్తిడి తీసుకువచ్చి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విశ్రమించేది లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తాము రాజకీయ విమర్శలు చేయడం లేదని.. తమ లక్ష్యం అంతా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడమేనని అన్నారు. పాదయాత్ర ద్వారా తాము చేపట్టిన పనులను ప్రజలకు వివరిస్తామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు సైతం పాలమూరు-రంగారెడ్డిపై ఈ రెండున్నర ఏండ్లలో ఏమేం పనులు చేశారో ప్రజల ముందు వివరించాలని అన్నారు. తాము నిర్వహించబోయే పాదయాత్రతో రైతులను, ప్రజలను జాగృతం చేస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>