కలం, జోగులాంబ గద్వాల: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో–97ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం గద్వాల (Gadwal) జిల్లా కలెక్టరేట్ ముందు ఏబీవీపీ నాయకులు, గద్వాల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు (ABVP Protest) చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేష్ పటేల్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అందిస్తున్న సాంకేతిక విద్యను ప్రైవేట్ సంస్థల్లో విలీనం చేయడం సరికాదని, ఇంజనీర్ కావాలనే వారి కలల్ని దూరం చేసి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ కు ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నితిన్ , ఎస్ఎఫ్ఎస్ కో కన్వీనర్ నరేంద్ర, సోషల్ మీడియా ఇంచార్జ్ సురేష్ నాయుడు, ఎంఏఎల్డీ కళాశాల ఏబీవీపీ అధ్యక్షులు తేజ , ఎస్వీఎం కళాశాల అధ్యక్షులు మంజునాథ్ నగర, కార్యాలయం కార్యదర్శి సాయి హర్ష, ఉదయ్, మురళి, ప్రణీత్, రోహిత్, భార్గవ్, నవ్య, శ్రావణి, అనుశ్రీ, శ్రీలత, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

