కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎంపీ ధర్మపురి అరవింద్.. సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అర్వింద్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసలు అర్వింద్ నిజామాబాద్‌కు ఏం తెచ్చారని ఎదురు ప్రశ్రించారు. పరస్పర విమర్శలు ఆరోపణలతో నిజామాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి..
అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి?
‘సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాకు పంగనామాలు పెట్టారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ని రాజకీయంగా అణగదొక్కేందుకు నిజామాబాద్‌కు మొండిచేయి చూపుతున్నారు. ఏ మొఖం పెట్టుకుని మహేశ్ కుమార్ గౌడ్ జిల్లాలో తిరుగుతారు. నిజామాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మరిచారు. ఇందూరు ప్రజలను మోసం చేస్తే ఇక్కడి ప్రజలు బుద్ధి చెప్తారు. దేవుళ్ళను మోసం చేసినోడికి ప్రజలను మోసం చేయటం లెక్క కాదు. కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తికావు. ఇప్పటివరకు 25 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. 162 కోట్లకు గాను కేవలం 10 కోట్ల నిధులు మాత్రమే యూడీసీకి ప్రభుత్వం కేటాయించింది. 2039 వరకు రాహుల్ ప్రధాని కారు అని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే రాహుల్ ఇక ప్రధాని కాలేరు ఇంకో పదేళ్లు దేశంలో బీజేపీ ఉంటుందని ఒప్పుకున్నట్టే. రేవంత్ రెడ్డికి బదులు కోమటి రెడ్డి లాంటి జన్యూన్ పర్సన్ ని ముఖ్యమంత్రిగా నియమించండి. ఉన్న పట్టణాలు అప్ గ్రేడ్ చేస్తా అన్న కెసిఆర్ నే ప్రజలు నమ్మలేదు ఇక లేని ఫ్యూచర్ సిటీ అంటే నమ్ముతారా?’ అంటూ అర్వింద్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్
ఏడేళ్లు నిజామాబాద్ ఎంపీగా 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనలో నిజామాబాద్ జిల్లాకు గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదంటూ భూపతి రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ అర్వింద్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై లేని పోని ఆరోపణలు చేస్తున్నాడంటూ విమర్శించారు. జిల్లాకు రింగ్ రోడ్ అనేది ఎన్నికల హామీ కాదని.. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇక్కడి పార్టీ నాయకులు విన్నవిస్తే.. తప్పకుండా రింగ్ రోడ్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలోనే జిల్లాకు రింగ్ రోడ్ రావడం ఖాయమన్నారు. దాన్ని వక్రీకరించి బీజేపీ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ పదవి ఊడితే ఆ పదవి కోసం ఎంపీ అరవింద్ మోడీని ఇంప్రెస్ చేసేందుకు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ నిజామాబాద్ తో పోలిస్తే పెద్దది మరి నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎందుకు కాలేదు.. పసుపు బోర్డుకు ఇప్పటికీ సొంత భవనం రాలేదు ఎందుకు మహేష్ కుమార్ లాంటి బీసీ బిడ్డకు అధ్యక్ష పదవి ఇస్తే అది ఓర్వలేకే అరవింద్ లాంటి వారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు? అంటూ భూపతి రెడ్డి ఫైర్ అయ్యారు.
నిజామాబాద్‌కు స్మార్ట్ సిటీ ఏదీ..? : డీసీసీ చీఫ్
‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో 3 అగ్రికల్చర్ యూనివర్సిటీలు మంజూరు చేస్తే అందులో నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి ఒకటి మంజూరు చేశారు. జిల్లాలో వ్యవసాయ కళాశాలగాని, తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పట్టుదల వల్లనే జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాలలు వచ్చాయి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చొరవతో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో ఆరు వందల కోట్లతో యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయి. కేంద్రం స్మార్ట్ సిటీలు ప్రకటిస్తే నిజామాబాద్ జిల్లాకు ఎందుకు రాలేదు. ఎంపీ ఎందుకు తీసుకురాలేదు. కేంద్రం నుండి ఎంపీగా అరవింద్ నిజామాబాద్ కు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. నిజామాబాద్ పార్లమెంటులో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు అన్ని పెండింగ్ లో ఉన్నాయి. పసుపు బోర్డు ద్వారా రైతులకు ఏం లాభం జరుగుతుంది. దీనిని పసుపు రైతులు గమనిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తున్న మీరు నిజామాబాద్ పార్లమెంట్‌కు ఏం తెచ్చారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి.’ అంటూ డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి ప్రశ్నించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.

