కలం, నల్లగొండ : బీఆర్‌ఎస్ పార్టీపై నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్నా కైలాస్ (Nalgonda DCC President) నేత నిప్పులు చెరిగారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేవంలో ఆయన మాట్లాడారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమంపై కైలాస్ నేత మండిపడ్డారు. అది రైతు సభ కాదని, ‘రైతు హంతకుల సభ’ అని అభివర్ణించారు. గత పదేళ్ల కాలంలో రైతులను నట్టేట ముంచి, మోసం చేసిన బీఆర్‌ఎస్ నేతలు కేవలం తమ ఖజానాలను మాత్రమే నింపుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పేరుతో రైతులను నమ్మించి మోసం చేశారని, నాటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల జరిగిన రైతుల ఆత్మహత్యలు, ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘోర ఘటనలు ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు.
వరి వేస్తే ఉరి అన్న నాటి పాలకుల మాటలు నేటికీ రైతుల గుండెల్లో గాయాలుగా మిగిలిపోయాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పేరుతో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు మిల్లర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని కైలాస్ నేత ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు అప్పట్లో కేసీఆర్ మద్దతిచ్చారని, బీఆర్‌ఎస్ పార్టీలో బీజేపీ బ్రీడ్ ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ను రియల్ ఎస్టేట్, ఇసుక, భూ దోపిడీదారుల సంకరజాతి పార్టీగా ఆయన అభివర్ణించారు. ఫామ్ హౌస్ రాజకీయాలకే పరిమితమైన ఆ పార్టీ భవిష్యత్తు ముగిసిపోయిందని, ఇకపై ఆ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాబోదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను కైలాస్ నేత తీవ్రంగా ఖండించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ స్థాయి, వ్యక్తిత్వం ముందు బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు సరిపోరని కౌంటర్ అటాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక జిల్లాలో గతంలో జరిగిన అక్రమాలకు, దోపిడీలకు పూర్తిగా చెక్ పడిందని డీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. నిరుపేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుండటంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు, క్వింటా ధాన్యానికి రూ. 500 బోనస్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు ప్రభుత్వం’ అని నిరూపించుకుందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇదే ప్రజాదరణతో 2029లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యాల రవీందర్ రెడ్డి, బోడ స్వామి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, మధగోని వెంకన్న, వావిళ్ళ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

