కలం/ఖమ్మం బ్యూరో: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక (Sri Rama Pattabhishekam) మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మిథిలా ప్రాంగణంలో శనివారం అత్యంత వైభవంగా జరిగిన ఈ మహోత్సవంలో దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల (Shiv Pratap Shukla) దంపతులు మహోత్సవానికి హాజరై స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ఆశీస్సులు పొందారు. మహోత్సవాన్ని ఆధ్యంతం తిలకిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. పట్టాభిషేక వేడుకలు సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి.
తొలుత రామాలయంలో భద్రుని మండపంలో స్వామివారి పాదుకలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం గౌతమీ నదీ తీరం నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి రాజ లాంఛనాలతో మిధిలా ప్రాంగణానికి ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చారు. భాజా భజంత్రీలు, సన్నాయి మేళాలు, భక్తుల కోలాటాలతో ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. కళ్యాణ మండపంలో స్వామివారు ఆశీనులైన అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. తరువాత పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణాలతో స్వామివారికి రాజలాంఛనాలు అలంకరించి పట్టాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద పారాయణాలతో పాటు విష్ణు పురాణం, భగవత్ శాస్త్ర పారాయణాలు జరిగాయి. పుష్కర జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ నిర్వహించగా, అనంతరం హారతులు సమర్పించారు.
పట్టాభిషేక వేడుకల సందర్భంగా మిధిలా ప్రాంగణం మొత్తం శ్రీరామ నామ స్మరణలతో మార్మోగింది. కార్యక్రమం అనంతరం అర్చకులు భక్తులపై పుణ్య నదీ జలాలను చల్లి ఆశీర్వదించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం (Sri Rama Pattabhishekam) వంటి ప్రధాన వేడుకలకు హాజరైన భక్తులు తీపి జ్ఞాపకాలతో వెనుదిరిగారు. ఈ మహోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఐటీడీఏ పీఓ రాహుల్, దేవస్థానం ఈవో దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరి మార్ట్‌ను గవర్నర్ సతీసమేతంగా ప్రారంభించారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధి, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం లక్ష్యంగా ఈ గిరి మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు గవర్నర్ కు తెలిపారు. అటవీ ఉత్పత్తులు, సేంద్రీయ ఆహార పదార్థాలు, గిరిజన హస్తకళా వస్తువులను ఒకే వేదికపై విక్రయానికి అందుబాటులో ఉంచడం ద్వారా గిరిజనులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. గిరి మార్ట్ ప్రారంభానంతరం అక్కడ అమ్మకానికి ఉంచిన గిరిజన ఉత్పత్తులను గవర్నర్ సతీసమేతంగా పరిశీలించి, వాటి ప్రత్యేకతలు, తయారీ విధానం, మార్కెటింగ్ సదుపాయాల గురించి జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.గవర్నర్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించారు.
Read Also: మరణంలోనూ మహోన్నతం.. సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్
Follow Us On: Sharechat

