కలం, వెబ్ డెస్క్ : సామాజిక మధ్యమాల్లో యాక్టివ్ ఉండే హైదరాబాద్ సిటీ సీపీ వి.సి సజ్జనార్ (Sajjanar) సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన ఓ ఘటనపై నెట్టింట ఎమోషనల్ పోస్టు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు బత్తిని హరీష్ గౌడ్ అకాల మరణం అత్యంత బాధాకరమని.. రోడ్డు ప్రమాదం రూపంలో విధి ఆ యువకుడి ప్రాణాలను బలితీసుకున్న వేళ.. పుట్టెడు శోకంలోనూ ఆయన తల్లి చూపిన గుండె నిబ్బరం, సామాజిక బాధ్యత మరువలేదని తెలిపారు. హరీష్ కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు దానం చేయడం ద్వారా ఆరుగురికి పునర్జన్మ లభించిందని చెప్పుకొచ్చారు.
తమ బిడ్డ ఇక లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకుంటూనే, హరీష్‌ను మరో ఆరుగురి రూపంలో బతికించుకోవాలని ఆయన తల్లి మహేశ్వరి గారు తీసుకున్న నిర్ణయం మహోన్నతమని కొనియాడారు. మరణానంతరం కూడా తోటి మనుషుల జీవితాల్లో వెలుగులు నింపిన హరీష్ త్యాగం చిరస్మరణీయమన్న సజ్జనార్ (Sajjanar).. సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన ఆ కుటుంబానికి తన సెల్యూట్ అంటూ ట్విట్టర్ లో ఓ ఎమోషనల్ పోస్టు చేశారు.ఈ సందర్భంగా అవయవ దానం (Organ Donation) చేయండి – ప్రాణదాతలు కండి అంటూ ప్రజలకు సజ్జనార్ పిలుపునిచ్చారు.
కాగా, హరీష్ గౌడ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో నివసిస్తూ మెట్రో షాపింగ్ మాల్ లో పని చేసేవాడు. ఇటీవల అతడికి బైకు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మలక్ పేట యశోద హాస్పిటల్ తరలించారు. ఐదు రోజులుగా ఐసీయూలో వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందించినప్పటికీ బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైద్యులు, జీవన్ దాన్ సంస్థ ప్రతినిధులు అవయవ దానంపై తల్లి మహేశ్వరి కి అవగాహనా కల్పించగా.. అవయవాలను దానం చేయడానికి తల్లి అంగీకరించింది. బ్రెయిన్ డెడ్ అయిన బత్తిని హరీష్ గౌడ్ అవయవాలను దానం చేసి ఆరు మందికి కొత్త జీవితం ప్రసాదించి సదరు తల్లి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. పుట్టడంతా శోకంలోనూ తల్లి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
Read Also: ఈవ్ టీజింగ్ అరికట్టేందుకు.. స్టూడెంట్ వేషాధారణలో ఎస్ఐ
Follow Us On: Instagram

