కలం, వెబ్ డెస్క్: ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌తో జరిగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ (SRH) ఊచకోత కోసింది. క్లాసెన్ క్లాసిక్ షాట్లతో అదరగొడితే, ఇషాన్ కిషన్ కూడా యమ క్లాస్‌గా స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించి, పంజాబ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. ముఖ్యంగా క్లాసెన్, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో స్టేడియం హోరెత్తిపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ శుభారంభం ఇచ్చారు. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35 పరుగులు చేసి తన ఫామ్ చాటుకున్నాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ (38 పరుగులు, 19 బంతులు) కూడా ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలోనే స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 54 పరుగుల వద్ద అభిషేక్ అవుటైనా, రన్‌రేట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మధ్య ఓవర్లలో ఇషాన్ కిషన్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 32 బంతుల్లో 55 పరుగులు (2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ రంగంలోకి దిగాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. పంజాబ్ బౌలర్లను టార్గెట్ చేస్తూ 43 బంతుల్లోనే 69 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి సైతం మెరుపులు మెరిపించి 13 బంతుల్లోనే 29 పరుగులు (నాటౌట్) చేయడంతో హైదరాబాద్ స్కోరు 230 దాటింది.
పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్ విపరీతంగా పరుగులు సమర్పించుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 61 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. చాహల్ పొదుపుగా బౌలింగ్ చేసి 32 పరుగులకే ఒక వికెట్ తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, ఫెర్గూసన్, వైశాఖ్ తలో వికెట్ పడగొట్టారు. 11.75 రన్‌రేట్‌తో సాగిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు పంజాబ్ దగ్గర సమాధానమే లేకపోయింది. ఇప్పుడు 236 పరుగుల భారీ టార్గెట్‌ను పంజాబ్ ఎలా ఛేజ్ చేస్తుందో చూడాలి.
Read Also: బాత్రూమ్స్ కడిగి, బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగి.. హ్యాట్సాఫ్ ప్రతీక్ష!
Follow Us On: WhatsApp

